Police Enquiry Fast Moving on PCB Files Burnt Case : కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన దస్త్రాలను దహనం చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తు అధికారి రామారావు నేతృత్వంలోని బృందం నిన్న విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇటీవల కృష్ణా నది కరకట్టపై దహనం అవుతున్న దస్త్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పీసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు రాబట్టారు. కార్యాలయం కాపలా సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం అక్కడి రికార్డులను పరిశీలించారు. ఆఫీసు నుంచి దస్త్రాలు తీసుకెళ్లిన సంగతి మీకు తెలుసా? కారులో ఎప్పుడు తీసుకెళ్లారు? వాహనాల రాకపోకలను రిజిస్టర్‌లో నమోదు చేస్తారా? కార్లను తనిఖీ చేస్తారా? వంటి ప్రశ్నలను అక్కడి సిబ్బందికి సంధించారు. తాము కార్ల నెంబర్లను నమోదు చేస్తామని, వాటిని తనిఖీ చేసే అధికారం తమకు లేదని సెక్యూరిటీ సిబ్బంది సమాధానం ఇచ్చారు.
పీసీబీ దస్త్రాల దహనంపై పవన్ కల్యాణ్ ఆరా - కీలక ఆదేశాలు - pawan kalyan on pcb documents issue
కాగితాలు కరకట్టపై తగలబెట్టిన రోజు కార్యాలయం నుంచే కారు వెళ్లిందా? వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేశారా? అని పోలీసులు ఆరా తీశారు. ఆ వివరాలు పట్టికలో లేవని, తమకు సమాచారం లేదని సిబ్బంది వివరించారు. అలాగే పోలీసులు తమ వెంట తెచ్చిన దస్త్రాలను పీసీబీ కార్యాలయంలోని సంబంధిత విభాగం సిబ్బందికి చూపించి వాటిని ఎవరు తయారు చేశారు? ఎవరి కోసం తయారు చేశారు? అవి రహస్యమైనవా? సాధారణమైనవా? ఆ దస్త్రాలు ఎలా, ఎవరి ద్వారా బయటకు వెళ్లాయి? అనే వివరాలను సేకరించారు. అలాగే సంబంధిత ఉద్యోగుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్నారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావు ఇంటికి పోలీసులు ఈరోజు (బుధవారం) వెళ్లారు. అయితే ఆయన అందుబాటులో లేరు. వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. ఆయన ఇంట్లో కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైళ్లు ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు తనిఖీ చేసేందుకు వెళ్లి నట్లు తెలిసింది. తాను హైదరాబాద్‌లో ఉన్ననని, విజయవాడ వస్తానని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని పోలీసులతో రామారావు మాట్లాడినట్లు సమాచారం. రామారావు అందుబాటులోకి వస్తే విజయవాడలోని ఆయన ఇంటిని పూర్తిగా తనిఖీ చేసే అవకాశం ఉంది.
బస్తాల కొద్దీ దస్త్రాలు దహనం - కొన్ని ఫైళ్లపై మాజీ మంత్రి ఫొటోలు - GOVERNMENT DOCUMENTS BURNT
విజయవాడ శివారులోని యనమలకుదురు కృష్ణా నది కరకట్టపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రణాళిక శాఖల దస్త్రాలు తగులబెట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనలో పీసీబీ మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉందంటూ ఎక్సైజ్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగి రామారావును విచారణకు పిలిచారు. రామారావు ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేశారు.
ఈ దగ్ధం వెనక ఎవరెవరు ఉన్నారో విచారణ చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని, పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి, భద్రపరచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడించాలని ఆధికారులకు స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకెళ్లాలన్నారు.