Instagram : చదువుకునే రోజుల్లో స్నేహితులంతా కలిసి ఏదైనా ట్రిప్ వేద్దామని చూస్తారు. ట్రిప్‌లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లడం.. ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రదేశాల్లో పర్యటిస్తారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే మాత్రం ట్రిప్ అనగానే ముందుగా గోవా వెళదామా మామా..! అంటూ ఉంటారు. అక్కడికి వెళ్లి అక్కడ బీచ్‌లలో సేద తీరి, ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అమ్మాయిలు అయితే మాత్రం ఎక్కడికి వారంతా సింగిల్‌గా వెళ్లరు.. అలాగని కలిసి వెళ్లరు. కానీ ఇక్కడ ఈ అమ్మాయిలు ఇద్దరు మాత్రం బీచ్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. పైగా వారు చదివేది ఎనిమిదో తరగతి. ఎలా వెళ్లారు.. ఎక్కడకు వెళ్లారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి బాలాజీనగర్, ఆల్విన్ కాలనీలకు చెందిన ఇద్దరు బాలికలు అక్కడ వివేకానందనగర్‌లోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరిలో ఓ బాలిక సొంతూరు ఏపీలోని బాపట్ల సమీపంలోని ఓ చిన్న గ్రామం. ఆమె అక్కడ ఉండే సూర్యలంక బీచ్ గురించి తరచూ ఇంకో బాలికకు చెబుతూ ఉండేది. దీంతో ఆ బాలికకు బీచ్‌కు వెళ్లాలనే ఆసక్తి పెరిగింది. ఇద్దరూ కలిసి వెళ్లాలని అనుకున్నారు. రోజూ మాదిరిగానే ఈనెల 20న బాలిక తల్లి పాఠశాల వద్ద వాహనంపై దింపి వెళ్లిపోయింది.
తిరిగి సాయంత్రం స్కూల్ విడిచిపెట్టే సమయానికి వెళ్లింది. తీరా చూస్తే తన కుమార్తె కనిపించకుండా పోయింది. తనతో పాటు మరో బాలిక కూడా కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన రెండు కుటుంబాల తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాల పరిసరాల్లోని సీసీ కెమెరాలలో రికార్డయిన ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ గుడి సమీపంలోని నిర్మాణ భవనంలోకి స్కూల్ యూనిఫామ్‌లో వెళ్లిన ఆ ఇద్దరు బాలికలు సాధారణ దుస్తులతో బయటకు రావడం పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమయిన పోలీసులు వారి ఇన్స్టాగ్రామ్ లోకేషన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల వైపు వెళుతున్నట్లు పక్కా సమాచారం సేకరించారు.
సూర్యలంక బీచ్ మార్గంలో ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం బయలుదేరి బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరి బాలికలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇద్దరి విద్యార్థినీ కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. వారు హైదరాబాద్ చేరుకున్నాక ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకున్నారు. దీంతో ఇద్దరి బాలికల కథ సుఖాంతమైంది.