Tangirala Sowmya Complaint on YSRCP Leaders : సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు, అబద్దపు పోస్టులు హోరెత్తుతున్నాయి. దీంతో సామాజిక మాధ్యమాల ప్రచారాల్లో ఏది నిజం? ఏది అబద్ధం? అని తెలుసుకునే పరిస్థితి లేకపోతోంది. విపక్ష వైఎస్సార్సీపీ ప్రారంభించిన హంగామా ఈ పరిణామాలకు పరాకాష్టగా నిలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీకి చెందిన కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Fake Posts on Tangirala Sowmya : 21 నెలల క్రితం కొందరు నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరచి తంగిరాల సౌమ్యకు మతిభ్ర మించిందంటూ అవమానించేలా తప్పుడు వీడియో క్లిప్పింగ్స్ పెట్టి వైరల్ చేశారు. దీంతో ఆమె మానసిక క్షోభకు లోనయ్యారు. ఆ సమయంలో ఈ విషయంపై సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు నిందితుడిని గుర్తించలేకపోయారు. దీంతోపాటు ఈ ఏడాది జనవరి 12న నందిగామ చందమామపేటలో జగనన్న వాక్‌వే రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా బహిరంగ సభలో భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అందులో తంగిర్యాల సౌమ్యపై ఫేస్బుక్లో వచ్చిన వీడియో క్లిప్పింగ్స్ ను ప్రదర్శించారు. అదే వేదికపై నుంచి ఆమెను కించపరిచేలా కొందరు అవమానకరంగా మాట్లాడారు. తాజాగా గత వారం రోజులుగా మళ్లీ అవే క్లిప్పింగ్‌లను వాట్సాప్‌లో వైఎస్సార్సీపీ నేత కరీముల్లా, అతడి కుమారుడు సాహిల్ షేర్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఈ నెల 18న వారిని పిలిపించుకొని ఎమ్మెల్యే సోదరుడు తంగిరాల శ్రావణ్ పిలిపించి మాట్లాడారు.
ఎందుకు తమ సోదరిపై తప్పుడు మీమ్స్ పెట్టి అవమానిస్తున్నారని వారిని తంగిరాల శ్రవణ్ ప్రశ్నించారు. దీంతో వారిద్దరూ ఆయనను కులం పేరుతో దూషించి 'నీ సంగతి, ఎమ్మెల్యే సంగతి చూస్తామంటూ' బెదిరించారు. ఈ విషయం తంగిరాల సౌమ్యకు తెలిసింది. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని తన సోదరుడి ద్వారా ఎమ్మెల్యే బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ సెక్షన్-3తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వైవీవీఎల్ నాయుడు తెలిపారు. గురువారం నాడు ఆ ఇద్దర్నీ స్టేషన్‌కు పిలిచి విచారించినట్లు ఆయన చెప్పారు.
సోషల్ మీడియాలో హోరెత్తుతున్న తప్పుడు ప్రచారాలు - prathidwani Debate on Fake news