Police Arrested Six People who Tried to kidnap : వ్యాపార విషయంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఆరుగురిని బాపట్ల జిల్లా చినగంజాం పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో చీరాల డీఎస్పీ మహ్మద్ మొయిన్ (DSP Mohammad Moin) పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి కిడ్నాప్‌కు గల వివరాలను వెల్లడించారు.
ట్రేడింగ్ వ్యాపారం పేరుతో మోసం : డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం చినగంజాం మండలం మున్నంవారిపాలెం పరిధిలోని బేతాళవారి పాలేనికి చెందిన పిల్లి కృష్ణారావుకు హైదరాబాద్‌కు చెందిన రియాజ్‌తో ఆన్లైన్లో కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. తాను ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ వ్యాపారం చేస్తున్నట్లుగా కృష్ణారావు రియాజ్‌ను నమ్మించాడు. దీంతో కృష్ణారావును నమ్మిన రియాజ్ సుమారు 10 రోజుల క్రితం రూ.36 లక్షలు ఆన్లైన్లో పంపించాడు.
ఆ తర్వాత కృష్ణారావుతో రియాజ్ మాట్లాడటానికి ప్రయత్నించినా కృష్ణారావు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్పందించలేదు. ఈ పరిస్థితులో రియాజ్ అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. అతను తన పరిస్థితిని హైదరాబాద్‌కు చెందిన స్నేహితులు కల్కి, ఆనంద్, నరేంద్రరెడ్డి, ఉమేష్ రెడ్డి, సాయి, కిరణ్‌కు వివరించాడు. కృష్ణారావు చిరునామా చెప్పడంతో ఆ ఆరుగురు స్నేహితులు రెండు కార్లలో ఆదివారం ఉదయం మున్నంవారిపాలెం వచ్చి ఇంట్లో నుంచి కృష్ణారావును బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు.
ఇది జరిగిన రెండున్నర గంటల తర్వాత కృష్ణారావు బావమరిది బెజ్జం హరికృష్ణ చినగంజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు కృష్ణారావు ఫోన్ ఆధారంగా కిడ్నాప్ చేసిన వారు చినగంజాం టోల్ ప్లాజా వైపు వెళుతున్నారనే సాంకేతిక సహకారంతో చినగంజాం టోల్ ప్లాజా దగ్గర కారు ఆపి, అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తులతో పాటు కృష్ణారావును కూడా చినగంజాం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కిడ్నాప్ చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ సయ్యద్ మొయిన్ తెలిపారు.