Police Harassment Against Parents : కన్న కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని రాష్ట్ర డీజీపీకి ఓ పోలీసు అధికారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులని కూడా చూడకుండా తమ కుమారుడు సీఐ నాగేశ్వర్ రెడ్డి వేధిస్తున్నాడని బాధితులు వాపోయారు. వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి సీఐగా విధులు నిర్వహిస్తుండగా, చిన్న కుమారుడు యాదయ్య కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారని వారు తెలిపారు. అయితే రఘునాథ్ రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమిని పెద్ద కుమారుడి పేరుపై 15 ఎకరాలు, చిన్న కుమారుడి పేరుపై 11 ఎకరాలు రాసిచ్చినట్లు, మిగిలిన భూమిని కుమార్తెలకు ఇచ్చేందుకు ఉంచుకున్నట్లు పేర్కొన్నారు.
Son Abusing Senior Citizen Parents : ఆ విషయంపై అతని పెద్ద కుమారుడు సీఐ అయిన నాగేశ్వర్ రెడ్డి తన పేరుపై ఇంకో ఐదెకరాల భూమి రాయించాలని ఒత్తిడి చేశారని, అది వినకపోయేసరికి పలుమార్లు తమను దూషించడంతో పాటు దాడి చేసినట్లు వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. పెద్ద కుమారుడి వేధింపులు తాళలేక తమ చిన్న కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రస్తుతం తమ పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. తన కుమారుడు నాగేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు.
'మేము చనిపోతే చెరో సగం ఆస్తి కావాలంటాడు నా చిన్న కుమారుడు. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, 20 ఎకరాలు ఇవ్వాలని మా పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి వేధిస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేని పద్ధతి ఏంటని, నువ్వు పెద్ద హోదాలో ఉన్నావు నీకెందుకు చక్కగా బతకమని మేం సర్ది చెప్పే ప్రయత్నం చేశాం. ఈ విషయంపై ఆగ్రహించి మాపై దాడికి దిగుతున్నాడు.' - బొజ్జమ్మ, సీఐ నాగేశ్వర్ రెడ్డి తల్లి
ఖాకీల కర్కశత్వం - దొంగతనం ఆరోపణలతో ఎస్సీ మహిళపై విచక్షణరహితంగా దాడి - Police Crushed Accused Woman