Amaravati Construction Material Moving in AP : గుంటూరు జిల్లా మందడం సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఎల్ అండ్ టీ సంస్థ గోదాము ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం హయాంలో సంస్థ రాజధానిలో వివిధ నిర్మాణ పనుల కాంట్రాక్టులను దక్కించుకుంది. భారీగా నిర్మాణ సామగ్రిని తీసుకు వచ్చి గోదాములో నిల్వ చేసింది. రాజధానిలో భూగర్భ విధానంలో తాగునీటి పైపులు, విద్యుత్తు, కమ్యునికేషన్ కేబుల్స్ వేసేందుకు పలు రకాల సామగ్రిని ఎల్ అండ్ టీ సంస్థ సమకూర్చుకుంది. పనుల్లో 2018లో విద్యుత్తు పైపుల మధ్య అమరిక కోసం వాడే ప్లాస్టిక్ ఫ్రేములను భారీ పరిమాణంలో తెచ్చి మందడం సమీపంలోని గోదాములో ఉంచింది.
సీఆర్డీఏ నుంచి అనుమతి తీసుకున్నారా? : వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి సామగ్రి అంతా నిరుపయోగంగా ఉంది. ఈ ప్లాస్టిక్ ఫ్రేములను తుక్కు కింద అమ్మేయాలని సంస్థ నిర్ణయించిందని చెబుతున్నారు. వీటిని దిల్లీకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం కొంత సరకు తరలినట్లు సమాచారం. ఇప్పటి వరకు మొత్తం ఐదు కంటైనర్లలో తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. వీటిని కొనుగోలు చేసిన వ్యక్తులు బుధవారం మందడం వచ్చి దగ్గరుండి మరీ వాటిని తరలిస్తున్నారు. అయితే వీటిని తుక్కు కింది అమ్మేందుకు సీఆర్డీఏ నుంచి అనుమతి తీసుకున్నారా? అన్నదానిపై స్పష్టత లేదు. ప్లాస్టిక్ వస్తువులను తుక్కు కింద అమ్మాల్సిన అవసరం ఏమిటన్నది తేలడం లేదు.
ప్రభుత్వం స్పందించాలని రైతుల డిమాండ్ : ఎల్ అండ్ టీ నిల్వ కేంద్రం నుంచి సామగ్రిని తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకున్నారు. భారీ కంటైనర్లలో రాజధాని ఎందుకు తరలిస్తున్నారని సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నందున, అప్పటి వరకు అయినా ఆగాలని కోరారు. ప్రస్తుతానికి తరలింపును నిలిపివేయాలని ప్రాథేయపడ్డారు. అమరావతి నిర్మాణానికి ఆటంకం కలిగించొద్దని వేడుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం తీసుకు వచ్చిన సామగ్రిని గుత్తేదారు సంస్థలు తరలింపుపై ప్రభుత్వం స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు - Amaravati Model Gallery