Police not found Pinnelli Venkatarami Reddy: ఇప్పటికి 60 రోజులు అవుతున్నా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో పాటు, తురకా కిశోర్‌లను పోలీసులు పట్టుకోలేదు. కొత్తగా వచ్చిన ఎస్సీ అయినా హత్యాయత్నం కేసులున్న పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి జాడ కనిపెడతారని బాధితులు ఆశిస్తున్నారు. పోలింగ్ రోజు, మరుసటి రోజు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో పాటు ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ దాడులకు పాల్పడ్డారు. మాచర్లలో పోలింగ్ కేంద్రాల వద్ద హల్‌చల్ చేశారు.
మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీ పోలింగ్ కేంద్రంలో బీభత్సం చేశారు. కారుతో ఢీకొట్టి పది మందిని గాయపర్చారు. టీడీపీ నేత కేశవరెడ్డి ఇంటిపై దాడి చేసి ఇల్లు, కారు ధ్వంసం చేశారు. వెల్దుర్తి మండలం కుండ్లకుంటలో టీడీపీ ఏజెంట్ మాణిక్యరావుపై పిన్నెల్లి సోదరులిద్దరూ దాడి చేశారు. దీనిపై మంగళగిరి పోలీసు స్టేషన్లో జీఆరో ఎఫ్ఐఆర్ కింద 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తర్వాత అది వెల్దుర్తికి బదిలీ అయింది. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో సీఐ పైనే దాడి చేశారు. ఈ ఘటనలో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదైంది. ఇలా రెండు 307 కేసులున్నా ఇంతవరకూ పోలీసులు అతని జాడ కనిపెట్టలేకపోయారు.
రిమాండ్ ఖైదీగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి: మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ పిటిషన్‌ను గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లి ఇప్పటికే అరెస్టయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి మాచర్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ నిరాకరించింది.
దీంతో పిన్నెల్లి గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ నెల పదో తేదీన విచారణకు రాగా పిన్నెల్లి తరపు న్యాయవాదులు బెయిల్ కోసం తమ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విని కుమార్ బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని, ఆయన పోలీసు విచారణకు ఏ మాత్రం సహకరించటం లేదన్న విషయాన్ని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీస్ కస్టడి విచారణ వివరాల్ని కోర్టు ముందుంచారు. వాదనల అనంతరం న్యాయమూర్తి శరత్ బాబు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ నెల 18వ తేదీన తీర్పునిచ్చారు.