Pinnelli Ramakrishna Reddy Anarchies: అరాచకశక్తికి అధికారం తోడైతే పేదప్రజలను ఏ విధంగా పీక్కుతినొచ్చో, సహజ వనరులను ఎలా కొల్లగొట్టొచ్చో చెప్పడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి ఉదాహరణ. రౌడీయిజం, దొంగ ఓట్లు, బెదిరింపులు, హత్యలతో రెండు దశాబ్దాలపాటు మాచర్లను చెరబట్టిన పిన్నెల్లికి అదే ఆలోచన ధోరణి కలిగిన జగన్ తోడవ్వడంతో మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థలను గుప్పిటపట్టారు. ఎస్పీస్థాయి నుంచి హోంగార్డు వరకు అందరినీ తన చెప్పుచేతల్లో ఉంచుకుని అరాచక పాలన సాగించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కబ్జాల నుంచి సహాజ వనరులు కొల్లగొట్టడం, బెదిరించి ఆస్తులు లాక్కోవడం వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే నడిచాయి. అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఎలాంటి వ్యాపారాలు చేయాలన్నా పిన్నెల్లికి వాటా ఇవ్వాలి. స్థిరాస్తి వెంచర్లలో భాగం పంచాలి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 20 ఏళ్లపాటు పిన్నెల్లి సాగించిన అరాచకం అంతా ఇంత కాదు.
బాధితులపైనే తిరిగి కేసులు: పోలీసుస్టేషన్లలో సైతం ఆయన పెట్టమంటేనే కేసు, లేకుంటే లేదు. తెలుగుదేశం కార్యకర్తలపై పిన్నెల్లి అనుచరులు దాడులు చేస్తే కాపాడమని పోలీసుస్టేషన్లకు వెళ్తే బాధితులపైనే తిరిగి కేసులు పెట్టేవారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి సోదరులు చేసిన దౌర్జన్యం అంతా ఇంత కాదు. వెల్దుర్తి మండలం జోపలవీడు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున మహిళా అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా ఆమె నామినేషన్ పత్రాలు చింపేశారు.
స్థానిక నేతలకు ధైర్యం చెప్పేందుకు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నపై కర్రలతో దాడులకు పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పిన్నెల్లి సోదరులు మరింత రెచ్చిపోయారు. బెదిరింపులకు పాల్పడటంతో మాచర్ల పురపాలికతోపాటు కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచు పదవులన్నీ వైఎస్సార్సీపీకే ఏకగ్రీవమయ్యాయి. ప్రతిపక్షాలను కనీసం నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసుల్లో పిన్నెల్లి అరెస్టు - Pinnelli Ramakrishna Reddy Arrest
ఇప్పటికీ ఆయన సోదరుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఐదేళ్లలో చేసిన అరాచకాలు, ఆకృత్యాలు, దారుణాలకు అంతేలేదు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో తెలంగాణ మద్యం తెచ్చి తన అనుచరులతో విక్రయించి పెద్దఎత్తున లబ్ధి పొందారు. బాపట్ల ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి వచ్చే గ్రానైట్ లారీలు సరిహద్దు దాటి వెళ్లాలంటే ఒక్కో దానికి 12వేలు వసూలుచేసి రూ కోట్లు వెనకేసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పేకాట శిబిరాలు నిర్వహించారు. మున్సిపల్ కాంట్రాక్టులు మొత్తం పిన్నెల్లి అనుచరులే చేశారు.
ఆత్మకూరు చెరువును చెరబట్టి అక్రమ తవ్వకాలు చేశారు. పేటసన్నెగండ్ల లక్ష్మీనరసింహాస్వామి ఆలయ భూముల్లో క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టి కోట్లు దోచుకున్నారు మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షం ఉండటానికి వీల్లేదన్నట్లు వ్యవహరించారు. ఎన్నికల అనంతరం పిన్నెల్లి సోదరులు కారంపూడిలో బీభత్సం సృష్టించారు. తెలుగుదేశం కార్యాలయం, కార్యకర్తలపైనా దాడులకు పాల్పడ్డారు. అడ్డుకోబోయిన సీఐపైనా దాడిచేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసుుల అరెస్ట్ చేశారు గానీ ఇప్పటికీ ఆయన సోదరుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.