Pollution in Nellore District : నెల్లూరు జిల్లాలోని ముత్తకూరు, టీపీ గూడూరు మండలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నాయి. చుట్టుపక్కల పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం, దుమ్ముధూళి వలన తాగే నీరు నుంచి తినే తిండి, ఇళ్లు, పొలాలు, ఆఖరికి మనుషులు వేసుకున్న దుస్తులతో సహా అన్నీ నల్లగా మారుతున్నాయి. ఈ కాలుష్య ప్రభావంతో అనారోగ్యం బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యని పరిష్కరించాలని అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని బాధిత గ్రామస్థులు వాపోతున్నారు.
ముత్తుకూరు మండలంలోని 10 పంచాయతీలు, టీపీ గూడూరు మండలంలోని రెండు గ్రామాలన్నో ఏళ్లుగా కాలుష్యంలోనే కాలం వెళ్లదీస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోని పామాయిల్ పరిశ్రమల నుంచి నిత్యం వెలువడుతున్న పొగ, దుమ్ముధూళితో నివాస ప్రాంతాలు నల్లగా మారుతున్నాయి. బాయిలర్ల నుంచి వెలువడే బూడిద, దుర్గంధంతో గాలి, నీరు, ఆహారం, పొలాలు కలుషితం అవుతున్నాయి. దీని వలన చర్మ సంబంధిత, శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల కాలుష్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు.
"ఈ ఫ్యాక్టరీల గత కొంతకాలంగా బూడిదను బయటకు వదులుతున్నాయి. దాని వలన పర్యావరణం మొత్తం నాశనం అయిపోయింది. బూడిద వల్ల చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. యువకులకు, మహిళలకు సైతం అనేక సమస్యలు వస్తున్నాయి. రహదారులపై దుమ్ము అంతా విస్తరించడంతో రోడ్డుపై ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నాం. సమస్యని పరిష్కరించాలని మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు" - స్థానికులు
Muthukur Mandal Peoples Problems : పామాయిల్ పరిశ్రమల నుంచి వెలువడుతున్నదుమ్ముధూళి చెట్లు, మొక్కలపై పేరుకుపోవడంతో నల్లగా మారుతున్నాయి. ఫ్యాక్టరీల వ్యర్థాలను సైతం కాలవల్లోకి వదలడంతో భూగర్భజలాలు కలుషితం అయి పొలాలు పాడవుతున్నాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు గత్యంతరం లేక పొలాలను నిరుపయోగంగా వదిలేస్తున్నారు.
మరోవైపు కృష్ణపట్నం పోర్టు నుంచి నిత్యం బొగ్గు రవాణా అవుతుండటంతో కృష్ణపట్నం, గోపాలపురం గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పోర్టు రహదారిపై దట్టంగా దుమ్ముధూళి పేరుకుపోవడంతో ఆ మార్గం మీదుగా ప్రయాణమంటేనే వాహనాదారులు హడలిపోతున్నారు. దట్టంగా దుమ్ము పైకి లేవడంతో వెనక వెళ్తున్న వాహనదారులు రోడ్డు కనిపించక అవస్థలు పడుతున్నారు. ఏపీ జెన్కో పవర్ ప్లాంట్ యాష్ పాండ్ వలన దేవరదిబ్బ గిరిజనకాలనీ, పైనాపురం గ్రామాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. బూడిదను నిల్వచేసే చెరువులు తెగినప్పుడల్లా ఈ గ్రామాల మీదకు వస్తున్నాయి. ఈ గ్రామాలను తరలించాలని పలుమార్లు కోరినా పట్టించుకున్న నాథుడే లేరని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలుష్యం కోరల్లో గుంటూరు ఛానల్ - అనారోగ్యంతో ప్రజల ఇబ్బందులు - Guntur Channel Contamination
విజయవాడ ఎన్టీటీపీఎస్ కాలుష్యం - చెట్లు, పశువులపైనా కమ్మేస్తున్న బూడిద