Property Purchases in Hyderabad: విజయవాడ జాతీయ రహదారిపై హైదరాబాద్ నగరానికి ముఖ ద్వారంగా ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గం కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఎల్బీనగర్‌లో దాదాపు 600 కాలనీలు ఉన్నాయి. దీంతో శివారు ప్రాంతం అనూహ్య స్థాయిలో పెరిగి రూపురేఖలే మారిపోయాయి. నివాసానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో ఏపీ ప్రజలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నాగోల్, ఎల్బీనగర్ నుంచి మెట్రో సదుపాయంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉండటంతో ఇక్కడ భారీగా కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు పెరిగాయి.
ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి: గతంలో ఎక్కువ మొత్తంలో స్థలాలు ఉండేవి. గజం ధర రూ.20 వేల నుంచి రూ.40 వేలు పలికేవి. ఆ సమయంలో చాలా మంది ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు కొన్నారు. ప్రస్తుతం ఇదే స్థలాలకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో శివారు కాలనీల్లోనూ గజం రూ.40 వేలకు పైనే ఉంది. ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో స్థలం కొని ఇల్లు కట్టుకోవడం మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది.
ఇల్లు కొనాలనుకుంటున్నారా - హైదరాబాద్‌లో ఈ ప్రాంతానికి ఫుల్ డిమాండ్
దీంతో 300 గజాల కంటే ఎక్కువగా స్థలం ఉంటే బిల్డర్లు ఆ స్థలంలో అపార్ట్మెంట్లు నిర్మించి ఫ్లాట్‌లను అమ్ముతున్నారు. వీటి ధరలు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంటాయి. శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో అయితే 1000 చదరపు అడుగుల ఫ్లాటు రూ.45 లక్షల వరకు వస్తుంది. ప్రజలు శివారు కాలనీల్లో అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉంటున్నారు.
కాలనీల్లో సైతం అపార్ట్మెంట్లు: గతంలో కేవలం మన్సూరాబాద్ వంటి ప్రాంతంలో మాత్రమే అపార్ట్‌మెంట్లు ఉండేవి. ప్రస్తుతం ప్రధాన రహదారి నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలనీల్లో సైతం అపార్ట్మెంట్లు కడుతున్నారు. వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, హస్తినాపురం ప్రాంతాల్లోని శివారు కాలనీల్లో ఇలానే జరుగుతుంది. ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను దృష్టిలో పెట్టుకొని 1000 చదరపు అడుగుల ఫ్లాట్లు రూ.50 లక్షల లోపు వచ్చేలా ప్లాన్ చేసి కడుతున్నారు.
మీ ఇంట్లో పెద్దలను కంటికి రెప్పలా కాపాడే డిజైన్లు - ఇవి ఉంటే చాలు!