Mee Seva Centre Services not working in Telangana : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న మీ-సేవ కేంద్రాలు మూడు రోజులుగా పని చేయడం లేదు. ఏ కారణంగా సేవలు నిలిచిపోయాయో సమాధానం దొరకని సమస్యగా మారింది. దీంతో సుమారు 40 రకాల సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలు 3 రోజులుగా సేవలందించలేకపోతున్నాయి. కొన్ని కేంద్రాలను నిర్వాహకులు మూసి వేసేశారు. ఓ వైపున కొన్ని స్కాలర్షిప్ దరఖాస్తులకు చివరి తేదీ ముగుస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ సంబంధిత రికార్డులు, ఇతరాత్ర అవసరాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది.
కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు రెవెన్యూ కార్యాలయాల నుంచి తీసుకోవాల్సిన ధ్రువీకరణ పత్రాలు కూడా తీసుకునే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు ఉదయం, సాయంత్రం మీ సేవల చుట్టూ తిరగడమే సరిపోతుందని, దయచేసి సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పాలని బాధితులు వేడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే సమస్య ఎదురుకావడంతో మీ సేవ కేంద్రాలు అన్ని కూడా సేవలందించలేకపోతున్నాయి.
'గత మూడు రోజుల నుంచి మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల కోసం తిరుగుతున్నాం. ఎల్ఆర్ఎస్ గురించి ఈసీ కోసం రోజూ వస్తున్నా ఆన్లైన్ సర్వీసులు పని చేయడం లేదని చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యలు ఉండడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న మీసేవ కేంద్రాలు పని చేయకపోవడంతో విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.'- దరఖాస్తుదారులు
సమస్య ఏంటో తెలియదంటున్న నిర్వాహకులు : సర్వర్‌లో లోపాలు తలెత్తాయని, అప్‌డేట్ చేసే పనిలో యంత్రాంగం నిమగ్నం అయినట్టుగా అంచనా వేసుకోవడం తప్ప ఎవరూ సమాచారం ఇవ్వడంలేదని దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. అప్లికేషన్ డేటా ఎంటర్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తోందని ఒక్కొక్క అప్లికేషన్ ఎన్నిసార్లు డేటా ఎంట్రీ చేయమంటారని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సర్వీసును మీసేవకు అనుసంధానించిన అధికారులు సమస్య ఏమిటో చెప్పకపోవడంతో దరఖాస్తుదారులతో చీవాట్లు పడాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో తెలిస్తే మీసేవ కేంద్రాలు మూసేస్తామని నిర్వాహకులు అంటున్నారు.
'దరఖాస్తుదారులు రోజూ వచ్చి వెళుతున్నారు. కానీ మీ-సేవ సర్వీసులు పని చేయడం లేదు. కొంతమంది ధ్రువీకరణ పత్రాలు పెండింగ్లో ఉన్నాయి. దాని గురించి ఏమైందని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కానీ మా దగ్గర సరైన జవాబు కూడా లేదు. మీ-సేవకు అనుసంధానించిన అధికారులు సమస్య ఏమిటో చెప్పకపోవడంతో మేము సైతం ఇబ్బందులు పడుతున్నాం. తక్షణం అధికారులు మీ సేవ కేంద్రాల సర్వీసుల పునరుద్ధరించాలి' - మీ సేవ నిర్వాహకులు
ఊరూరా మీ-సేవ కేంద్రాలు - డ్వాక్రా సంఘాలకు మంజూరు చేయనున్న సర్కార్ - Govt Focus On Set Up Mee Seva