People Die Due to Polluted Water : ప్రభుత్వ నిర్లక్ష్యానికి గుంటూరులో సామాన్యులు బలైపోతున్నారు. గుక్కెడు నీళ్లే వారి పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. కలుషిత నీరు తాగి వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందారు. మరో 200 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో రైలుపేటకు చెందిన ఇక్బాల్ శుక్రవారం మృతి చెందారు. ఈ నెల 10న పద్మ అనే గిరిజన యువతి మరణించింది. వారం వ్యవధిలోనే మృతుల సంఖ్య రెండుకు చేరడంతో నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద సంఖ్యలో నీటి, ఆహార నమూనాలు సేకరిస్తున్న అధికారులు కాలుష్యానికి కారణం ఏమిటో మాత్రం చెప్పడంలేదు. వైద్యమంత్రి విడదల రజిని (Vidadala Rajini) ఆహార కల్తీ వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని పద్మ మృతి అనంతరం అన్నారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాదు. సామూహిక భోజనాలూ చేయలేదు. ఆహార కల్తీ ఎలా కారణమవుతుందని విలేకరులు ప్రశ్నిస్తే.. ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు.
Polluted Water in Guntur : గుంటూరులోని మంచినీటి పైపులైన్ వ్యవస్థ లోపభూయిష్ఠంగా మారింది. శారదా కాలనీ తదితర ప్రాంతాలకు కలుషిత జలాలు సరఫరా అవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఐదారేళ్ల క్రితం పాత పైపులైన్లు తీసేసి కొత్తవి వేశారు. పాత వాటిని డమ్మీ చేయకుండా వదిలేయడంతో వాటి నుంచి కూడా నీటి సరఫరా జరుగుతోంది. అవన్నీ చాలావరకు మురుగునీటి కాల్వల్లో ఉన్నాయి. వాటికి కొన్నిచోట్ల లీకులు ఏర్పడ్డాయి. ఘటన జరిగిన తరువాత కానీ ఈ విషయం అధికారులు తెలుసుకోకపోవడం ప్రజారోగ్యం పట్ల వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.
గుంటూరు నగర ప్రజల ఆరోగ్య స్థితిపై వైద్యారోగ్య శాఖ మంత్రి సమీక్ష
నగరంలో తాగునీటి నాణ్యత పరీక్షలు మొక్కబడిగా జరుగుతున్నాయి. ప్రతి వార్డు సచివాలయ పరిధిలోనూ కిట్లు, సామగ్రి ఉన్నాయి. గత కమిషనర్ నిశాంత్‌కుమార్ వాటితోనే ప్రతి రోజూ 20 నమూనాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టి పర్యవేక్షించేవారు. ప్రస్తుతం దానిని గాలికి వదిలేశారు. విరేచనాలు, వాంతులతో అత్యధికులు బాధపడుతున్న శారదా కాలనీ ఎగువన రహదారులు, కల్వర్టులు, డ్రెయిన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏడాదిగా ఆ పనులను సాగదీస్తున్నారు. ఎక్కడైనా పొరపాటున తాగునీటి పైపులు దెబ్బతిన్నా వాటిలోకి మురుగు నీరు చేరి నీళ్లు కలుషితమవుతాయి. ఈ విషయాన్ని కూడా అధికారులు గమనించడంలేదు.
Diarrhea in Guntur : మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద ఐదారేళ్ల క్రితం నగరానికి 400 కోట్లతో తాగునీటి వసతి, సౌకర్యాలను కల్పించారు. మూడు, నాలుగేళ్ల నుంచి పంపుసెట్లు, మోటార్లు పనిచేయకపోయినా పట్టించుకునే నాథుడు లేకపోవటంతో ప్రజలకు సరిపడా నీళ్లు రావడం లేదు. 132 ఎంఎల్‌డీ నీటి సరఫరాకు ఏర్పాట్లు ఉన్నా అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రస్తుతం 90 ఎంఎల్‌డీకి మించి అందడం లేదు. నగరానికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఉండవల్లి నుంచి పైపులైన్ల ద్వారా నీళ్లు చేరేలా పంపుహౌస్‌లు, మోటార్లు అమర్చారు.
ప్రాణాలు తీస్తున్న కలుషిత నీరు - ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అధికారులు
ఉండవల్లిలో 5 పంపులు ఉండగా వాటిలో రెండు ఏడాదికి పైగా పనిచేయడం లేదు. తక్కెళ్లపాడులో 42 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మూడు ఫిల్టర్ ప్లాంట్లు ఉండగా వాటిలో కొన్ని పంపులు, ఫిల్టర్ బెడ్లు పనిచేయక నీటిలో నాణ్యత లోపిస్తోంది. అలాగే పది విలీన గ్రామాలకు మెరుగైన తాగునీటి సరఫరా కోసం 38 కోట్ల అమృత పథకం నిధులతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గోరంట్ల కొండపై మంచినీటి పథకానికి పనులు ప్రారంభించి 60 శాతానికి పైగా పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తిచేసి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురాకుండా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
గుంటూరులో డయేరియా కలకలం - కలుషిత నీరు తాగి యువతి మృతి, 10 మందికి అస్వస్థత