Essential Commodities Prices Hikes : వేతనజీవులు నెల జీతాన్ని ప్రణాళికతో వెచ్చిస్తుంటారు. పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు పక్కాగా ప్రణాళిక వేసుకుంటారు. కొన్నాళ్లుగా పెరుగుతున్న నిత్యవసరాల ధరలతో వేతన జీవులు లోటు బడ్జెట్‌ను ఎదుర్కొంటున్నారు. సిద్దిపేటకు చెందిన నరేశ్ చిరుద్యోగి. చాలీచాలని వేతనంతో ఆరుగురి కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. ప్రతి నెలా ఖర్చులకు ప్రణాళికతో వెచ్చిస్తుంటాడు. కొన్నాళ్లుగా పెరిగిన ధరలతో లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్నాడు. నిత్యావసర ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రతి నెలా రూ.3 వేలు ఖర్చు చేయగా, కొన్నాళ్లుగా ఆ లెక్క రూ.4,500కు పెరిగింది.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు బియ్యం ఉడకనంటోంది, నూనె ధర చేజారుతోంది, పప్పు బద్దకిస్తోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో బేజారవుతున్నారు. ప్రతి నెలా పెరిగిన నిర్వహణ ఖర్చులతో కుటుంబ సారథి, ఇంటిని వెళ్లదీసేందుకు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. కొన్నాళ్లుగా పెరుగుతున్న ధరలతో షాక్‌కు గురవుతున్నారు. పెద్ద పండగలైన దసరా, దీపావళి వచ్చేశాయి. పండగల వేళ ప్రజలంతా ఇబ్బందులకు గురవుతున్నారు.
దడ పుట్టిస్తోంది : మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరలు భయం పుట్టిస్తున్నాయి. సగటున క్వింటాకు రూ.500 నుంచి రూ.1000 వరకు పెరిగాయి. నెల రోజుల వ్యవధిలో పెరుగుదల ప్రభావం చూపింది. ఐదుగురు సభ్యులున్న ఉన్న కుటుంబంలో నెలకు కనీసం 40 నుంచి 50 కిలోల బియ్యం అవసరమవుతాయి. పాత సన్నబియ్యం ధరలు భారీగా పెరగడంతో దొడ్డు బియ్యం వైపు మొగ్గుచూపుతున్నారు.
20 శాతం పెరిగి : వంటనూనె ధరలు సలసల మండుతున్నాయి. 15 రోజుల్లోనే ఆయిల్ ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి. ఈ మార్పు స్పష్టమైంది. పల్లీ, సన్ ఫ్లవర్, రైస్ బ్రాన్ ఆయిల్ కొనలేని పరిస్థితి. ప్రతి నెలా సరాసరి 5 కేజీలు వాడుతుండగా, ఇప్పుడు 3 కిలోలకు తగ్గించేందుకు చూస్తున్నామని గజ్వేల్‌కు చెందిన మారుతి పేర్కొన్నారు. పండుగల సీజన్‌లో పిండి వంటలకు ఆయిల్ ఉపయోగించడం తప్పనిసరి కావడంతో ఏం చేయాలన్న డైలమాలో పడిపోతున్నారు.
కొనలేక : వంటకాల్లో ఎండు కొబ్బరి రుచిని పెంచుతుంది. పోషకాలను, చిక్కదనాన్ని అందిస్తుంది. పది రోజుల్లో దీని ధర అమాంతం పెరిగింది. ఆరు నెలల్లో పప్పుల ధరలు సైతం పెరిగాయి. మరోవైపు కేజీ నువ్వులు రూ.180కు చేరింది. చక్కెర రూ.41, రవ్వ- రూ.42, గోధుమపిండి రూ.40 పలుకుతోంది. గతంతో పోలిస్తే రూ.5 పెరిగినట్లు స్పష్టమవుతోంది. కూరగాయల ధరలూ మండుతున్నాయి.
నిత్యావసర సరకుల ధరలు పైపైకి - దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో - ESSENTIALS RATES HIKE IN TELANGANA
నూనెలు కొనలేం! - పప్పులు తినలేం!! - పండుగల వేళ వంటింట్లో 'ధర'ల మంట - Essentials Price Increased