PENSION DISTRIBUTION ARRANGEMENTS: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7 వేల రూపాయల చొప్పున సామాజిక భద్రత పింఛన్లను నూతన ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. గత నెలలో ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 66.34 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ప్రతి నెలా 1967.34 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా, సాధారణ పింఛనుదారులకు నెలకు 4 వేల రూపాయలు అందిస్తున్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు తదితర 11 విభాగాలకు చెందిన వారికి 4 వేల రూపాయలు ఇస్తున్నారు.
అదే విధంగా దివ్యాంగులకు, బహుళ వైకల్యం సంభవించిన వారికి 6 వేల రూపాయల చొప్పున, పక్షవాతం, తీవ్రమైన కండరాల లోపం ఉన్న వారికి, ప్రమాద బాధితులకు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి 15 వేల రూపాయలు, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడీ చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పింఛను కింద 10 వేల రూపాయలను అందిస్తున్నారు.
ఉద్యోగం లేకున్నా పెన్షన్ కావాలా! - రోజుకు 7రూపాయలు పొదుపు చేస్తే చాలు - Atal Pension yojana
అధికారులకు సూచనలు: గత నెలలో విజయవంతంగా పింఛన్ పంపిణీ చేసిన అధికారులు, ఆగస్టు నెలలో కూడా అదే విధంగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి మొదటి రోజులో 99 శాతం మందికి పంఛన్లను పంపిణీ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఆగస్టు 1వ తేదీన పింఛను పంపిణీ కోసం సిబ్బంది అంతా ఉదయం 6.00 గంటలకే ప్రారంభించాలని తెలిపారు. మొదటి రోజే 99% పంపిణీ పూర్తి కావాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. పంపిణీ సమయము పొడిగింపు ఉండదని తేల్చిచెప్పారు.
మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీ గురించి అన్ని గ్రామాల్లో, సామాజిక మాధ్యమాల్లో, బహిరంగ ప్రదేశాల్లో విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. 90 కంటే ఎక్కువ మంది పింఛనుదారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేసి ఉన్న చోట తగ్గించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన రీ- మ్యాపింగ్ ప్రక్రియను నేడు పూర్తి కావాలన్నారు. సెక్రటేరియట్ వారీగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్ని ఎంపీడీఓలు, కమిషనర్లకు పంపించామని, ఈ మొత్తాలు 31వ తేదీన సెక్రటేరియట్ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతాయన్నారు.
2వ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత, చెల్లించని మొత్తాన్ని రెండు రోజుల్లోపు సెర్ప్‌కి (Society for Elimination of Rural Poverty) తిరిగి చెల్లించాలని సూచించారు. చెల్లించని పింఛన్లన్నింటికీ కారణాలు తప్పనిసరిగా పొందుపరచాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, కమిషనర్లు తమ తమ సెక్రటేరియట్లలో పింఛన్ల పంపిణీని పర్యవేక్షించాలని, మొదటి రోజే పంపిణి పూర్తి చేసేలా చూసుకోవాలన్నారు. పింఛన్ల పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను https://www.serp.ap.gov.in/SHGAP/ సందర్శించండి.