Peddavagu Project Destruction Caused By Flood: వరుణుడి ఉగ్రరూపానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఇళ్లు, పొలాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంపై తీవ్ర ప్రభావం చూపింది. మొత్తం ఆరు గ్రామాల్లో వరద విధ్వంసం సృష్టించగా పదుల సంఖ్యలో బాధితులు నిరాశ్రయులయ్యారు. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ఇంట్లో ఉన్న సామాన్లు కొట్టుకుపోగా కట్టు బట్టలతో మిగిలిపోయారు.
తెలంగాణలోని అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండితో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రాజెక్టు కుడివైపు గండి పడటంతో ఒక్కసారిగా వచ్చిన వరదతో ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టులోని నీళ్లన్నీ దిగువ గ్రామాల్లోకి వెళ్లడంతో ప్రాజెక్ట్ ఖాళీ అయింది. వందలాది ఎకరాల్లో వరినాట్లు నామరూపాల్లేకుండా పోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు వేర్లతో సహా కొట్టుకుపోయాయి. రోడ్లు భారీగా ధ్వంసమయ్యాయి.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు- ఉప్పొంగుతున్న వాగులు - Heavy rains in AP
అశ్వారావు పేట మండలంలోని కమ్మరిగూడెం, మేడేపల్లి, కోయి మాదారం, గుల్లవాయి, అల్లూరి నగర్, రెడ్డిగూడెం, గొల్లగూడెం, వసంతవాడ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. వరద నీటి తీవ్రతకు వందలాది పశువులు గల్లంతు కాగా వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఊళ్లు వరద గుప్పిట్లో చిక్కుపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు చెట్లు, కొండలు, ఎత్తైన ప్రదేశాలను ఆశ్రయించారు. అధికారులు వరద గురించి అప్రమత్తం చేసినా సామాన్లు తీసుకునే సమయం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని మేడేపల్లి గ్రామస్థులు వాపోయారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి పెద్దవాగు బాధితులకు భరోసా కల్పించారు. వరద సహాయక కేంద్రాలకు రావాలంటూ బాధితులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఐటీడీఏ పీవో సూర్య తేజతో కలిసి ముంపు గ్రామాల్లో ఆమె పర్యటించారు. పెద్దవాగు ప్రాజెక్ట్ కట్ట తెగిపోయి కొట్టుకుపోయిన గ్రామాలను పరిశీలించారు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద సహాయక కేంద్రాలలో బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించామన్నారు. వరద తగ్గేవరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలో కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయం నాలుగు గేట్లను ఎత్తి 17వేల క్యూసెక్కుల వీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో ఎర్ర కాలువ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం, పంగిడిగూడెం, పేరంపేట గ్రామాల్లోని 15 వందల ఎకరాలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
తణుకు మండలం దువ్వ గ్రామం వద్ద వయ్యేరు కాలువ ఉద్ధృతికి అక్విడెక్ట్ వద్ద నీటిమట్టం 11 అడుగులకు చేరుకుంది. దీంతో వయ్యేరు కాలువ గట్టుని ఆనుకుని ఉన్న సుమారు 60 ఇళ్లు, పంటపొలాలు నీట మునిగాయి. నివాసితులు గట్టుపైకి చేరుకున్నారు. దువ్వ గ్రామం వద్ద వయ్యేరు కాలువ ముంపునకు గురైన ప్రాంతాలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద భారీగా పోటెత్తింది. ప్రాజెక్ట్ వద్ద క్రమేపి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో మూడున్నర లక్షల క్యూసెక్కుల జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.