Peddapalli Oded Bridge Collapses Again : ఇటీవల బిహార్లో వరుస వంతెనలు కూలుతున్న ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలోనూ అలాంటి ఘటనే జరిగింది. 70 రోజుల వ్యవధిలో ఒకే వంతెన రెండుసార్లు కూలింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. నిర్మాణంలో నాణ్యత లోపం వల్లనే మరోసారి వంతెన కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడిపోయాయని చెబుతున్నారు. అర్ధరాత్రి కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య దూరాన్ని తగ్గించి, రాకపోకలకై మానేరు వాగుపై ఓడేడ్ గ్రామ పరిధిలో ఓ వంతెనను 2016లో నిర్మించారు. అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. 2016 ఆగస్టు నెలలో రూ.49 కోట్ల అంచనాతో బ్రిడ్జి నిర్మాణ పనులను మొదట్లో ప్రారంభించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యం అయ్యాయి.
పనులు ఆలస్యం కావడంతో రెండేళ్లుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1,2 నంబరు పిల్లర్లలో మూడు గడ్డర్లు కిందపడ్డాయి. అయితే 2023-24లో మరోసారి ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.11 కోట్లను కేటాయించారు. తొమ్మిదేళ్లు వస్తున్నా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణం కావడంతో పక్కనే తాత్కాలిక మట్టి రహదారి నిర్మాణం చేసి ఇరువైపులా రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మానేరు వాగులో నీటి ప్రవాహం పెరిగి రాకపోకలను నిలిపివేశారు.
కూలిన ఐదు గడ్డర్లు : మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17,18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఆర్అండ్బీ అధికారులు అక్కడకు చేరుకొని గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈ బ్రిడ్జిలో ఉన్న మొత్తం 8 గడ్డర్లు కూలిపోయాయవు, నిర్మాణం పూర్తికాకముందే గడ్డర్లు నేలకూలడంతో నాణ్యత లోపం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్రదర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
రైలొచ్చిందా ఆగిపోవాల్సిందే! - అరగంట పాటు పడిగాపులు కాయాల్సిందే - Zaheerabad Railway Over Bridge
ఈదురుగాలులకు కూలిన మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన - BRIDGE COLLAPSES IN MANAIR VAGU