Pawan Kalyan visit Eleru Flood Affected Areas: ఏటా ముంపునకు కారణమవుతున్న ఏలేరు ప్రాజెక్ట్ ఆధునికీకరణ పనులను చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతంలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఏలేరు వరద బాధితులను ఆదుకుంటామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ముంపు ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టించారని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్‌తో మాట్లాడుతూనే ఉన్నానని అన్నారు. ముంపు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
సుద్దగడ్డ వాగు సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ తప్పులను మేము సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జగనన్న కాలనీ స్థలాన్ని రూ.30 లక్షల భూమిని రూ. 60 లక్షలకు కొన్నారని విమర్శించారు. ఏలేరు వరద పరిస్థితిపై సమీక్షించి సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం చేశారు పవన్ మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం బాధ్యతగా తీసుకున్నట్లు వివరించారు. బుడమేరు విషయంలో ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని ఆ ఆక్రమణలు తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారని పవన్ అన్నారు.
పవన్‌కల్యాణ్‌కు స్వల్ప అస్వస్థత - జ్వరంతోనే అధికారులతో సమీక్ష
ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ముందుగా ఆక్రమణలు గుర్తించాలని అందరితో కలిసి మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది అన్నది నా అభిప్రాయమని తెలిపారు. నదీ, వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలని సూచించారు. వరద విపత్తు నుంచి కోలుకోవడానికి విజయవాడకు సమయం పట్టొచ్చని వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు నిత్యం పనిచేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్‌తో మాట్లాడాను. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సుద్దగడ్డ వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఏలేరు వరద పరిస్థితిపై సమీక్షించి సూచనలు ఇస్తున్నాను. బుడమేరులో ఆక్రమణలకు పాల్పడిన వారితో మాట్లాడాలి. అది ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారు. అందరితో కలిసి మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది. నదులు, వాగుల ప్రాంతాల్లోని కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలి.- పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం