Palnadu Road Accident : అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి పెద్దమ్మ ఇంటి వద్ద వేసవి సెలవులను ఆనందంగా గడపాలనుకున్న ఆ చిన్నారిని చూసి విధికి కన్ను కుట్టింది. బస్సులో ఆనందంగా బయలుదేరిన ముక్కుపచ్చలారని బాలికను మాంసపు ముద్దగా మార్చి మృత్యువు పొట్టన పెట్టుకుంది. కళ్లెదుటే కన్నవారు సజీవ దహనమవుతున్నా ఏమీ చేయలేని దుస్థితి ఆ కూతురిది. చెల్లెలి కుమార్తె వారి ఒడిలోనే అగ్నికి ఆహుతవుతున్నా కాపాడలేని నిస్సహాయ పరిస్థితి ఆ పెద్దమ్మది. గుండెలు పిండే ఈ హృదయ విదారక దృశ్యాలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో కనిపించాయి.
వారితోనే కడ వరకు పయనం : బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలాయపాలేనికి చెందిన ఉప్పుగుండూరి కాశీబ్రహ్మేశ్వరరావు, లక్ష్మి దంపతులకు భావన, పూజిత అనే ఇద్దరు కుమార్తెలు. దర్శి మండలం తూర్పువీరాయపాలేనికి చెందిన ముప్పరాజు వెంకట సుబ్బారావు, దుర్గా పూజితల కుమార్తె ఖ్యాతి సాయిశ్రీ(9). తల్లిదండ్రులు ఉద్యోగం నిమిత్తం ఒంగోలులో నివసిస్తుండటంతో చిన్నారి అక్కడే ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి తాతయ్య, అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం. వృద్ధులిద్దరూ పాప సంరక్షణ కోసం ఒంగోలులోనే చిన్న కుమార్తె వద్ద ఉంటున్నారు. చిన్నారి పెద్దమ్మ భావన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో తాతయ్య, అమ్మమ్మతో కలిసి హైదరాబాద్‌లోని పెద్దమ్మ వద్దకు వెళ్లింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు నీలాయపాలెం వస్తున్న వారితో కలిసి వచ్చింది. అదే రోజు ఒంగోలు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో మంగళవారం రాత్రి 9 గంటలకు చినగంజాం వెళ్లారు. రాత్రి సుమారు 11.30 గంటలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు.
పల్నాడు జిల్లాలో బస్సు-టిప్పర్ ఢీ - ఆరుగురు దుర్మరణం - PALNADU ROAD ACCIDENT TODAY
మాంసం ముద్దలు.. ఎముకల గూళ్లు : పల్నాడు జిల్లా పసుమర్రు వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో మంటలు వ్యాపించి బస్సంతా పొగ కమ్ముకుంది. భావన కిటికీలో నుంచి కిందికి దూకడంతో ప్రాణాలు దక్కించుకుంది. అమ్మ, నాన్న, చెల్లెలి కూతురు బస్సులోనే ఉండిపోయారని, వారు అగ్నికి ఆహుతున్నారని గుర్తించి గుండెలవిసేలా రోదించింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. రెండు కుటుంబాలకు మొదటి పాప కావడంతో ఖ్యాతిశ్రీసాయిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. బస్సు ప్రమాదంలో కుమార్తె, తల్లిదండ్రులు మృతిచెందడంతో పూజిత సంఘటనా స్థలం వద్దకు చేరుకుని దీనంగా రోదించారు. బస్సులో కనిపించిన మాంసం ముద్దలు, అస్తిపంజరాలు, ఎముకలను చూసి తల్లడిల్లారు. విషయం తెలుసుకున్న పర్చూరు తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి చిలకలూరిపేట వైద్యశాలలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం బాలిక స్వగ్రామమైన దర్శి మండలం తూర్పువీరాయపాలెం వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
టైర్ పేలి ట్రక్కును ఢీకొన్న కారు- 8మంది మృతి- మరో ప్రమాదంలో ఆరుగురు మరణం - Road Accident