Theft Cases in Palnadu District : దొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏ వస్తువు అయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకుంటున్నారు. ఇక ఇళ్లు, కార్యాలయాలకు తాళం కనిపించిదంటే చాలు చేతికి పని దొరికిందని సంబరపడుతున్నారు. వాటిని లూఠీ చేసే వరకు మనశ్శాంతి లభించదనుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారు. రద్దీ ప్రదేశాలు, జన సముహా ప్రాంతాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేటుగాళ్లు తమ చేతివాటానికి పనిచెబుతున్నారు. చటుక్కున అందినకాడికి దోచుకొని అక్కడినుంచి ఉడాయిస్తున్నారు.
తాజాగా పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు ఘటనల్లో చోరీలకు పాల్పడుతున్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లాలోని చిలకలూరిపేట, వెల్దుర్తి, ఐనవోలు, ఈపూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దొంగతనాలు జరిగినట్లు చెప్పారు. వీటిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే నిందితుల కదలికలపై నిఘా పెట్టి అరెస్ట్ చేశామని తెలియజేశారు. వారి నుంచి సుమారు 25 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కంచి శ్రీనివాసరావు వివరించారు.
Robbery Gang Arrested in Palnadu : ఇందులో భాగంగా చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్ సుభాని అనే వ్యక్తిని వద్ద 170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, రూ.10,000లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సీ కంచి శ్రీనివాసరావు వివరించారు. అయినవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలమంద, కొమ్మిరిశెట్టి రామాంజనేయుల నుంచి 8 ద్విచక్ర వాహనాలు, ఈపూరు పీఎస్‌లో వెంకటేశ్వర్లు నాయక్, భూక్యా బాలాజీ నాయక్, పూడివాలస గణపతిల నుంచి రూ.4 లక్షలు విలువ చేసే ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో మట్టపల్లి హరిబాబు అలియాస్ కమ్మ కాశీ, చల్లా భవాని శంకర్, షేక్ మస్తాన్వలీల నుంచి 10 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. నిందితులను రిమాండ్‌కి తరలించినట్లు చెప్పారు. ఈ కేసులను చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, గురజాల డీఎస్పీ, తదితరులు పాల్గొన్నారు