IAS Conferment Interviews : అస్మదీయులు, ప్రభుత్వ పెద్దల సామాజికవర్గాలకు చెందిన వారిని రాష్ట్రంలో ఐఏఎస్ కేడర్‌లోకి చొప్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ నుంచి కొందరు సీనియర్ అధికారుల జాబితాను స్టేట్ సివిల్ సర్వీసుకు చెందిన కొందరు సీనియర్ అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎఎస్‌లుగా పదోన్నతులు కల్పించేందుకు యూపీఎస్సీకి ప్రభుత్వం జాబితా పంపింది.
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ముఖ్య అధికారి ఓఎస్డీ పేరుతో సహా మొత్తం 10 మంది జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది. కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతుల కోసం వీరందరికీ జూన్ 7న ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు పైస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చినట్టు సమాచారం. జూన్ 7 న 9 గంటలకు దిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన కొందరు అధికారులకు సమాచారం అందింది.
ఐఏఎస్ కన్ఫర్మెంట్ను వాయిదా వేయాలి - యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ - Chandrababu Letter to UPSC Chairman
ఆడిట్ విభాగంలో పని చేస్తూ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ధనుంజయ్ రెడ్డికి ఓఎస్డీగా గడికోట మాధురి, భూమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, ఎం.కె.వి శ్రీనివాసులు, మామిళ్లపల్లి వరప్రసాద్, డి. దేవానందరెడ్డిలను ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సిందిగా యూపీఎస్సీ పేర్కొంది. అలాగే అదే రోజు మద్యాహ్నం ఒకటిన్నరకు యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూకు రావాల్సిందిగా పీఎస్ సూర్యప్రకాశరావు, గుండిపాగ రాజారత్నం, సీబీ హరినాథ రెడ్డి, సీహెచ్ పుల్లారెడ్డి, ఏఏఎల్ పద్మావతికి సమాచారం అందింది.
గడచిన ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ అనుకూలురుగా ఉన్న వీరందరికీ పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ స్థాయిలో నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ పదిమందిలో కేవలం ఇద్దరికి మాత్రమే ఐఏఎస్‌లుగా పదోన్నతులు కల్పించేందుకు ఖాళీలు ఉన్నాయి. స్టేట్ సివిల్ సర్వీసులోని ఇద్దరికి పదోన్నతులు కల్పించేలా ముఖ్యమంత్రి కార్యాలయంలోని సీఎంకు దగ్గరగా ఉండే ఓ అధికారి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. గత ఏడాదిలోనూ ధనుంజయ్‌రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన నీలకంఠారెడ్డికి కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి కల్పించారు. ఇప్పుడు కూడా ఆయనకు ఓఎస్డీగా పని చేస్తున్న మాధురితో పాటు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే ఐఏఎస్ పదోన్నతి వచ్చేలా ప్రయత్నాలు జరిగాయని తెలుస్తోంది.
మరోవైపు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికారులకు ఐఏఎస్‌లుగా పదోన్నతులు కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడో తేదీన దిల్లీలో జరగాల్సిన యూపీఎస్సీ ఇంటర్వ్యూలను వాయిదా వేయాల్సిందిగా ఏపీలోని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి, యూపీఎస్సీకి కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు రాష్ట్ర కేడర్‌కు చెందిన అధికారుల జాబితాను కన్ఫర్డ్ ఐఏఎస్‌ల కోసం పంపించటం సరికాదని దీనిలో పారదర్శకత లేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అందువల్ల పునఃపరిశీలించాల్సిందిగా యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు.
ఈసీ బదిలీ చేసిన ఐఏఎస్‌లకు, మరో ముగ్గురికీ ప్రభుత్వం పోస్టింగ్ - Postings to IAS Officers in AP