Opposition parties react to constable death: రాష్ట్రంలో అధికార పార్టీ అండతోనే ఎర్రచందనం స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారని జనసేన పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అన్నమయ్య జిల్లా కెవి.పల్లి మండలంలో పోలీసు కానిస్టేబుల్ గణేశ్ హత్య వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. ఎర్ర చందనం తరలిస్తున్న వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన దుర్మార్గానికి పాల్పడిన వారి వివరాలు వెల్లడించాలన్నారు.
ముఠాలను వైఎస్సార్సీపీ పెంచి పోషిస్తోంది: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఘటనలో మృతి చెందిన కానిస్టేబుల్ గణేశ్ కుటుంబానికి జనసేన నేత నాదెండ్ల మనోహర్ తన సానుభూతి తెలియజేశారు. కానిస్టేబుల్ ను వాహనంతో ఢీకొట్టి హత్య చేస్తే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎర్ర చందనం స్మగ్లర్లు ఇంతటి దురాగతానికి పాల్పడ్డా ఆ ముఠా వెనక ఎవరు ఉన్నారో పోలీసులు వెల్లడించకుండా గోప్యత పాటించడంపై అనుమానం వ్యక్తం చేశారు. శేషాచలం అడవుల్లోంచి విలువైన ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించేస్తున్న ముఠాలను వైఎస్సార్సీపీ పెంచి పోషిస్తోందని ఆరోపించారు. పాలకపక్షం అండతోనే స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారుని విమర్శించారు. అటవీ శాఖ స్వాధీనంలో ఉన్న ఎర్ర చందనాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో సక్రమంగా విక్రయించలేకపోతోందన్నారు. అదే సమయంలో స్మగ్లర్లు మాత్రం ఎర్రచందనాన్ని యధేచ్చగా సరిహద్దులు దాటించేస్తున్నారని విమర్శించారు. అరుదైన ఎర్ర చందనాన్ని కాపాడాల్సిన బాధ్యతను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు.
కానిస్టేబుల్ గణేష్ కుటుంబంలో అంతులేని విషాదం- పెద్ద దిక్కు కోల్పోయి మిన్నంటిన రోదనలు
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎర్రచందనం మాఫియా: జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అనుచరులు రాష్ట్రంలో లక్షల కోట్ల ఎర్రచందనం సంపద దోచేశారని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. జగన్ మంత్రివర్గ సహచరుడు పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి, ప్రస్తుత చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయానంద రెడ్డిలే ఎర్రచందనం మాఫియా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులనే చంపేంత స్థాయికి ఎర్రచందనం మాఫియా బరితెగిస్తుంటే, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండటం వల్లే, పోలీసుల మరణానికి కారణమైన వాహనాన్ని కూడా ఇంతవరకు ట్రేస్ చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
రెచ్చిపోయిన ఎర్ర చందనం స్మగ్లర్లు - కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు
పోలీసుల్ని ఢీ కొట్టి వెళ్లిన వాహనం విజయానంద రెడ్డి శిష్యుడు గజ్జల శ్రీనివాస రెడ్డిదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి తెలిపారు. గజ్జల శ్రీనివాస్ రెడ్డి భార్య అన్నమయ్య జిల్లా కేవీపల్లి జడ్పీటీసీ అన్నారు. పోలీసులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, విజయానంద రెడ్డిలతో పాటు వారి ఆధ్వర్యంలోని స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రకృతి సంపద కాపాడాకోవాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్మగ్లింగ్ నేతల్ని పోలీసులు ఓడించాలని సూచించారు. చనిపోయిన పోలీసుకు తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పించారు. మూడు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
స్మగ్లర్లు, గూండాలకు సీఎం జగన్ ప్రాధాన్యమిస్తుంటే వారు పోలీసులను లెక్కచేస్తారా?: చంద్రబాబు