One year of Chandrababu Arrest : సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున అభిమాన నాయకుడు చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చాయి. పోలీసు దిగ్బంధాలను అధిగమించి ఆందోళన చేశారు. ఆయన అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. చంద్రబాబు విడుదలయ్యే వరకు తెలుగు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి సంఘీభావం తెలిపారు.
అరాచకాలు, అకృత్యాలతో ఐదేళ్లపాటు చెలరేగిపోయిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంద్రబాబు అరెస్టు ద్వారా తనకు తానే మరణశాసనం లిఖించుకుంది. 151 మంది ఎమ్మెల్యేలున్నారంటూ విర్రవీగిన అప్పటి సీఎం జగన్‌ను అదే ప్రజలు మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేశారు. విధ్వంస ప్రభుత్వాన్ని నిశ్శబ్ద విప్లవంతో సాగనంపారు. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా చేసి జగన్‌ను ఒక ఎమ్మెల్యేగా శాసనసభలో కూర్చోబెట్టారు. కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు కట్టబెట్టి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేశారు.
పోలీసుల అత్యుత్సాహం : 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో జరిగిన బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారంటీ సభలో పాల్గొన్న చంద్రబాబు రాత్రికి అక్కడే బస్సులో బస చేశారు. అదే సమయంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించిన కేసులో ఆయణ్ని అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసేందుకు డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. వందలమంది పోలీసులతో బస్సును చుట్టుముట్టి వీరంగం సృష్టించారు. అవసరమైతే చంద్రబాబు నిద్రించే బస్సు తలుపులు పగలగొట్టి మరో వాహనంతో లాక్కెళ్తామని హూంకరించారు.
ఉదయ ఐదున్నర గంటల సమయంలో బస్సు అద్దాలపై బాదుతూ చంద్రబాబును నిద్ర లేపారు. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న ఆయనను ఉదయం 6 గంటల సమయంలో అరెస్టు చేసి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిట్ కార్యాలయానికి తెచ్చి విచారించారు. అనంతరం కోర్టు రిమాండు ఇవ్వడంతో రాజమహేంద్రవరం జైలుకు తీసుకెళ్లారు.
జగన్ ఉన్మాద ఆలోచనలకు వంతపాడిన అధికారులు : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 2.13 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. అయినా సంస్థకు సంబంధించిన నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ సీఐడీ విభాగం చంద్రబాబుపై కేసు బనాయించి అరెస్టు చేసింది. సీఐడీ అధిపతి సంజయ్, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విజయవాడ, హైదరాబాద్, దిల్లీల్లో ప్రెస్‌మీట్లు పెట్టి చంద్రబాబే ప్రధాన కుట్రదారు అని ప్రకటించడం ద్వారా జగన్ ఉన్మాద ఆలోచనలకు వంతపాడారు.
పవన్ కల్యాణ్ అడ్డగింత : చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రమంతా ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఆయన్ను రోడ్డుమార్గంలో నంద్యాల నుంచి విజయవాడ తీసుకొస్తున్న సమయంలో అడుగడుగునా టీడీపీ శ్రేణులు అడ్డుపడ్డాయి. పెద్దఎత్తున పోలీసుల్ని మొహరించి వారిని లాఠీలతో చితకబాదుతూ ఈడ్చిపడేశారు. చంద్రబాబుకు సంఘీభావం తెలియజేసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమానంలో రాకుండా అడ్డుకున్నారు. రోడ్డు మార్గాన వస్తుండగా పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. దీంతో పవన్ రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేశారు.
చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ఆలయాల్లో పూజలు చేసేందుకు వెళ్తున్న వారిపైనా పోలీసులు ఉక్కుపాదం మోపి అడ్డుకున్నారు. గృహనిర్బంధాలు అమలు చేశారు. ఎన్నడూ ఇంటి నుంచి కదలని మహిళలూ పోలీసు నిర్బంధాన్ని దాటుకుని రోడ్డెక్కి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఆయన అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఉద్యమించారు. బెంగళూరు, చెన్నైతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలుచోట్ల సంఘీభావ ప్రదర్శనలు చేపట్టారు.
అమెరికా, యూకే, దుబాయ్ సహా సుమారు 70 దేశాల్లో ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రజలు ర్యాలీలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టుతో కలత చెంది రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రాణాలు విడిచారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర నిర్వహించి వారి కుటుంబాలకు తామున్నామంటూ భరోసా ఇచ్చారు. 2023 సెప్టెంబర్ 9న నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్టై 52 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు అక్టోబరు 31వ తేదీన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జైలు నుంచి విడుదలైన ఆయనకు విజయవాడ వరకు దారిపొడవునా ప్రజలు నీరాజనం పలికారు. 200 కిలోమటర్ల ప్రయాణానికి సుమారు పదమూడున్నర గంటలు పట్టింది.
జైలు నుంచి జనం గుండెల్లోకి : చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో ఉన్న సమయంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. రాష్ట్రంలో ఎన్టీయే కూటమికి అక్కడ నుంచే అడుగులు మొదలయ్యాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి జైలులో ఆయణ్ని కలిసి వచ్చిన అనంతరం 2024 ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అనంతరం బీజేపీతో పొత్తు కుదిరింది. మూడు పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేశాయి. తిరుగులేని ప్రజాభిమానంతో 164 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగించాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుతో గళమెత్తిన తెలుగు ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటుతో బుద్ధి చెప్పారు. విధ్వంసపాలనకు చరమగీతం పడారు.