BRS Telangana Decade Celebrations 2024 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ద కాలం పూర్తవుతోంది. రాష్ట్ర ఏర్పాటు మొదలు మొన్నటి వరకు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాలకపక్ష హోదాలో నిర్వహిస్తూ వచ్చింది. ఈ మారు తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు గులాబీ పార్టీ రూపకల్పన చేసింది.
అమరవీరులకు నివాళి : అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించడం 2001లో పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమ ప్రస్థానం, ఆ తర్వాత రాష్ట్ర రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ నేతృత్వంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేలా వేడుకలు జరపనున్నారు. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ఇవాళ సాయంత్రం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసి అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించనున్నారు. హైదరాబాద్ గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.
ఛాయాచిత్ర ప్రదర్శన : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించిన తర్వాత ర్యాలీ ప్రారంభం అవుతుంది. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు, వివిధ వర్గాల వారు ర్యాలీలో మొత్తం పది వేల మంది వరకు పాల్గొంటారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనా కార్యక్రమాలు అద్దం పట్టేలా ఛాయాచిత్ర ప్రదర్శనను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల మూడో తేదీన అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. జాతీయ జెండా, పార్టీ జెండాలను ఎగరవేసి సమావేశాలు నిర్వహిస్తారు. ఆసుపత్రులు, ఇతర చోట్ల పళ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు.
"గన్‌పార్క్ నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ర్యాలీ ప్రారంభం అవుతుంది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థులు పాల్గొంటారు. -కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ సీనియర్ నేత
దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోన్న ట్యాంక్‌బండ్ - పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు