Old Woman Missed in Forest : మేకలు మేపడానికి వెళ్లిన ఓ వృద్ధురాలు అడవిలో తప్పిపోయి వారం రోజుల తర్వాత ఇంటికి చేరిన ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పురపాలిక పరిధి అప్పన్నపల్లికి చెందిన చంద్రమ్మ(71) అనే వృద్ధురాలు రోజూ సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకలు మేపి సాయంత్రం ఇంటికి వచ్చేవారు.
మేకలు ఇంటికి వచ్చినా వృద్ధురాలు రాలేదు: గత నెల 30వ తేదీన ఏడు మేకలతో ఆమె అడవికి వెళ్లారు. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చేసినా వృద్ధురాలు మాత్రం రాలేదు. అందోళనకు గురైన కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి అటవీ ప్రాంతంలో గాలించినా ఫలితం లేకపోయింది.
సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా: అటవీ ప్రాంతంలో అక్కడకక్కడ అటవీశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నాయి. వృద్ధురాలు తప్పిపోయిన విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆయా కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. సిబ్బంది టీమ్‌లుగా ఏర్పడి అటవీ ప్రాంతంలో 4 రోజుల పాటు వెతికినా ఆమె దొరకలేదు. ఎట్టకేలకు ఈ నెల 5వ తదీన గోల్‌బంగ్లా (వాచ్ టవర్) ప్రాంతం వద్ద ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ ద్వారా గుర్తించి, వృద్ధురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
మేకలతో అడవికి వెళ్లిన రైతు - తిరిగి రాకపోవడంతో ఉలిక్కిపడిన గ్రామస్థులు
ఆశలు వదులుకున్నాం: వెంటనే వారు వాచ్ టవర్ వద్ద, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆమె కనిపించలేదు. 6వ తేదీన ఉదయం మళ్లీ కుటుంబ సభ్యులు, అటవీ శాఖ అధికారులు వచ్చి అటవీ ప్రాంతంలో వెతికారు. నడవటం కూడా చేతకాక ఓ చెట్టును పట్టుకుని దయనీయ స్థితిలో ఉన్న వృద్ధురాలు చంద్రమ్మను ఇంటికి చేర్చారు. వృద్ధురాలి ఆచూకీ లభించటంతో ఆమె కుటుంబ సభ్యుల ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. వారం రోజులైనా దొరకకపోవటంతో ఆశలు వదులుకున్నామని, గాలింపు చర్యలు చేపట్టి ఆచూకీని గుర్తించిన అటవీశాఖ అధికారులు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలుపున్నామని చంద్రమ్మ కుమారుడు సుధాకర్ తెలిపారు.
వారం రోజులు నీళ్లు మాత్రమే తాగి ఉన్నా: తాను చిన్నప్పటి నుంచి అటవీ ప్రాంతానికి వెళ్తున్నానని, ఎప్పుడూ లేని విధంగా ఈసారి అడవిలో తప్పిపోయానని చంద్రమ్మ చెప్పుకొచ్చారు. ఇంటికి వచ్చే దారి తెలియక అడవిలోనే తిరుగుతూ ఉన్నానని, వారం పాటు నీళ్లు మాత్రమే తాగి పడుకున్నానని అన్నారు. కాళ్లకు చెప్పులు లేకపోవడంతో ముళ్లు గుచ్చుకొని నరకయాతన అనుభవించానని ఆమె చెప్పారు. పాములు, క్రూరమృగాలు ఉండే ప్రాంతం కావటంతో బిక్కుబిక్కుమంటూ గడిపానని చంద్రమ్మ తెలిపారు.
ముంబయిలో తప్పిపోయి కర్నూలులో ప్రత్యక్షం - ఏడేళ్ల తర్వాత అమ్మానాన్న చెంతకు