Old Age Voters Cast Their Vote : సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటిన వృద్ధులు. ఆ ఏముందిలే. నేనొక్కడ్ని ఓటేయకపోతే జరిగే నష్టమేం లేదు. ఆ క్యూలైన్లలో నిలబడి సమయం వృథా చేసుకోం అని అనుకునే వారందరికీ ఓటు విలువ చాటి చెప్పారు. ఈ పెద్దోళ్లు. ఎలాగైనా ఓటేద్దాం అనే సంకల్పంతో ఆరోగ్యం బాగలేకపోయినా, శరీరం సహకరించకున్నా, ఓటేసేందుకు కుటుంబసభ్యుల సహకారంతో వీల్ ఛైర్లలో కదలివచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధం అంటూ నేటి తరానికి మార్గదర్శకులుగా నిలిచారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కొందరు వృద్ధ ఓటర్లు ఎంతో కష్టపడి ప్రయాణాలు చేసి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మా బాధ్యత నెరవేర్చాం మరి మీరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఓటు వేసేందుకు వచ్చి మృతి చెందిన వృద్ధురాలు - Old lady Died After Voting
సిరాను చూపిస్తూ బాధ్యత నెరవేర్చామంటూ గర్వం : అనకాపల్లి జిల్లా చోడవరంలో 90 ఏళ్ల ఈ బామ్మ ఇద్దరు మనవళ్లను వెంటబెట్టుకుని ఓటేసేందుకు ఎంతో ఉత్సాహంగా తరలివచ్చారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నడవలేని వృద్ధులు కూడా చేతికర్రలు, స్టాండ్ల సాయంతో వచ్చి ఓటేసి స్ఫూర్తి చాటారు. అల్లూరి జిల్లా పాడేరులో ఎన్నికల సిబ్బంది సాయంతో పండుటాకులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ వేలికి ఉన్న సిరాను చూపిస్తూ బాధ్యత నెరవేర్చామంటూ గర్వంగా ఫీలయ్యారు.
ఓటు హక్కు వినియోగించుకున్న స్వాతంత్య్ర సమరయోధురాలు : కృష్ణా జిల్లా కోసూరివారిపాలెంలో ఓ వృద్ధురాలు మండుటెండను సైతం లెక్కచేయకుండా ఓటేసేందుకు ఉత్సాహంగా వచ్చారు. అవనిగడ్డ 138 పోలింగ్ బూత్‌లో వృద్ధ దంపతులు క్యులైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గోరా కుటుంబానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు మనోరమ 96 ఏళ్ల వయస్సులో ఓటు వేశారు. ఐదేళ్లకోసారి వచ్చే ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఓటేసి హైదరాబాద్ బాట పట్టిన జనం -కిక్కిరిసిన మెట్రో, బస్సులు - Voters Returned To Hyderabad
ఓటును వేసి ఆదర్శంగా నిలిచిన వికలాంగులు : పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులకు, దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ఈసీ చెప్పినా చాలా చోట్ల వీల్‌ఛైర్లు కూడా లేవు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా కాసేపు క్యూలైన్లో ఉండి వృద్ధులు ఓటేశారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో పెద్దఎత్తున వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల జాతరలో వికలాంగులు సైతం భాగస్వామ్యులయ్యారు. భవిష్యతుకు పునాది లాంటి ఓటును వేసి ఆదర్శంగా నిలిచారు.