Officials not interested in building CP Brown Library in Kadapa : కడపలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో దాదాపు 80 వేలకు పైగానే తెలుగు సాహితీ పుస్తకాలు, గ్రంథాలు, పరిశోధన పత్రాలు ఉన్నాయి. 200 వరకు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. దశాబ్దాలుగా భాషా పరిశోధన కేంద్రం విస్తరించక పోవడంతో పుస్తక ప్రియులకు, సాహితీ వేత్తలకు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీనిని విస్తరించాలని, నూతన భవనాలను నిర్మించాలని జానమద్ధి సాహితీపీఠం మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న జానమద్ధి విజయభాస్కర్ ఏళ్లతరబడి పాలకులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదులు, లేఖలు రాస్తూనే ఉన్నారు.
నిధులు విడుదల చేయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం : ఆయన కృషికి ఫలితంగా 2021 జులై 9న కడప పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం జగన్ సీపీ బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించి దీనిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇక్కడికి రావడానికి రెండు రోజుల ముందే సీపీ బ్రౌన్ గ్రంథాలయ అభివృద్ధి కోసం రూ. 5.50 కోట్ల మంజూరు చేస్తున్నట్లు జీవో నంబర్ 94 విడుదల చేశారు. జీవోలో నిధులు మంజూరైనట్లు చూపించినా విడుదల చేయలేదు. మరోసారి జానమద్ధి విజయభాస్కర్ వైఎస్సార్సీపీ పాలకులకు లేఖలు రాయడంతో 2023 జులై 11న సవరించిన అంచనాలతో జీవో నంబర్ 92 విడుదల చేశారు. అంచనాలు పెంచి 6 కోట్ల 87 లక్షల 40 వేల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
యోగివేమన వర్సిటీ ఖాతాలో నిధులు : ఆ నిధులను 2023 డిసెంబరు 20న విడుదల చేసిన వైఎస్సార్సీపీ సర్కార్ రూ. 3.21 కోట్లలతో 25 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసినా వాటిలో భవనాన్ని నిర్మించడానికి మాత్రం అధికారులు ఆసక్తి చూపడంలేదు. రూ. 3.66 కోట్లలు యోగివేమన విశ్వవిద్యాలయం ఖాతాలో ఉన్నా భవన నిర్మాణం మొదలు కాలేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని కడపలో విస్తరించడానికి, ప్రజలకు అవగాహన కల్పించడానికి నిర్వాహకులు సరైన చొరవ చూపలేదని సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనంపై పెరుగుతోన్న ఆసక్తి - Youth interested For Reading Books
ఆసక్తి చూపని అధికారులు : సీపీ బ్రౌన్ బాషా పరిశోధన కేంద్రం నిర్వహణ బాధ్యత యోగివేమన వర్సిటీ పర్యవేక్షిస్తోంది. రెండేళ్ల నుంచి సీపీ బ్రౌన్ గ్రంథాలయం పాలకమండలి సమావేశాలు కూడా నిర్వహించలేదు. సలహాలు, సూచనలు స్వీకరించే పరిస్థితి లేక గ్రంథాలయం అభివృద్ధి కుంటుపడిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వమైనా గ్రంథాలయ అభివృద్ధికి పాటుపడాలని తెలుగు భాషాభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీపీ బ్రౌన్ పరిశోధన కేంద్రానికి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.
బస్సులో మినీ లైబ్రరీ - యువ డ్రైవర్ వినూత్న ఆలోచన - MINI LIBRARY IN BUS