Officials Not Implementing Model Code of Conduct: ఎన్నికల కోడ్ అమలు విషయంలో అధికారులు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. చాలా చోట్ల అధికారులు ఇంకా స్వామిభక్తిలోనే మునిగి తేలుతూ ప్రతిపక్షాలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (chandrababu Naidu) నివాసం వద్ద అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఏర్పాటు చేయించిన సిమెంట్ బల్లలు పసుపు రంగులో ఉన్నాయంటూ వాటిని ధ్వంసం చేశారు. చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చే కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా లోకేశ్ సిమెంట్ బల్లలను ఏర్పాటు చేయించారు. అయితే ఆ బల్లలు పసుపు రంగులో ఉన్నాయంటూ అధికారులు వాటిని కూల్చేశారు.
ఎన్నికల కోడ్‌కు అడ్డంకిగా భావిస్తే పసుపు రంగు బల్లల మీద సున్నం పూస్తే సరిపోయేది కదా అని తెలుగుదేశం నేతలు అంటున్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలపై జగన్ బొమ్మ ఉన్నా పట్టించుకోని అధికారులు, అందరూ కూర్చునే బల్లలపై కక్షగట్టి పడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ లక్ష్యంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.
అధికారుల అత్యుత్సాహం- చంద్రబాబు నివాసం వద్ద పసుపు రంగు బల్లలు ధ్వంసం
గుంటూరు నగరంలో ఎన్నికల కోడ్ అమలు విషయంలో అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. మంత్రి విడదల రజిని నగరంలోని వివిధ పార్కుల్లో వైసీపీ రంగులతో సిమెంటు బెంచీలు వేయించారు. వాటిపై తన పేరు కూడా రాయించుకున్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. అయితే టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన బెంచీలకు మాత్రం తెలుపు రంగు వేశారు. అలాగే టీడీపీ నాయకులు తమ ఇళ్లకు కట్టుకున్న బ్యానర్లు సైతం తొలగించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ టీడీపీ గుంటూరు పశ్చిమ ఇంఛార్జ్‌గా ఉన్న కోవెలమూడి నాని ఇంటి వద్ద అధికారులు కాసేపు హడావుడి చేశారు.
మరోవైపు పలుచోట్ల వైసీపీ అధికారులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ నేతలు విశ్వయత్నాలు చేస్తున్నారు. పలుచోట్ల తాయిలాలు పంచుతున్నారు. అదే విధంగా వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈసీ హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఇంటింటికీ వెళ్లి వైసీపీని గెలిపించాలని కోరుతున్నారు. పథకాల సర్వే పేరుతో వాలంటీర్ల సాయంతో ఓటర్లను వైసీపీ నేతలు మభ్యపెడుతున్నారు. అదే విధంగా వాలంటీర్లకు సైతం తాయిలాలు ఇస్తున్నారు. వాలంటీర్లను వైసీపీ తరఫున ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు- అచ్చెన్న