Officials Did Not Change NTR Name Properly in Health University: విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును తిరిగి పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అధికారులకు మాత్రం పట్టడం లేదు. ఇప్పటికీ విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును కూడా సరిగా ఏర్పాటు చేయలేదు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు టీడీపీ శ్రేణులు విశ్వవిద్యాలయం పైన ఉన్న 'వైఎస్' అనే అక్షరాలను తొలగించి 'ఎన్టీ' అంటూ తగిలించారు. ఇప్పటికి 5 నెలలవుతున్నా ఆ అక్షరాలే దర్శనమిస్తున్నాయి. కనీసం ఎన్టీఆర్ పేరును కూడా ఇప్పటివరకూ సరిగా ఏర్పాటు చేయలేదు.
పేరును మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు వెలువడి 3 నెలలు దాటుతోంది. అయినా అధికారుల్లో చలనం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విశ్వవిద్యాలయానికి ఆఘమేఘాలపై పేరు మార్చి, వైఎస్ విగ్రహాన్ని రాత్రికి రాత్రి తీసుకొచ్చి ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పుడు తొలగించేందుకు మాత్రం మీనవేషాలు లెక్కిస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే మొట్టమొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని విజయవాడలో నెలకొల్పిన టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత నేత ఎన్టీఆర్ పేరును తొలగించిన గత జగన్ ప్రభుత్వం ఆయనను తీవ్రంగా అవమానించింది.
ప్రపంచంలో ఎక్కడచూసినా మనవాళ్లే - అనునిత్యం కొత్త ఆలోచనలు చేయాలి: చంద్రబాబు
ఈ క్రమంలో జగన్ వైఎస్‌ఆర్ పేరును విశ్వవిద్యాలయానికి పెట్టారు. ఆ వెంటనే విశ్వవిద్యాలయం పైన ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్‌ఆర్ అంటూ పెట్టారు. విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం ఎదురుగా భారీ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని పెట్టారు. ప్రస్తుతం పేరు మార్చడంతో ఇక్కడి నుంచి వైఎస్ విగ్రహాన్ని తొలగించాలంటూ విశ్వవిద్యాలయం ఉద్యోగ సంఘం నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో జూన్ 04నే ఈ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. విగ్రహానికి ఉన్న శిలా ఫలకాన్ని తొలగించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రభుత్వానికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయగా స్పందించిన సీఎంవో వెంటనే విగ్రహం తొలగించాలని విశ్వవిద్యాలయ అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాలను ఎప్పుడో తొలగించారు. ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఏకైన వైద్య విశ్వవిద్యాలయంలో ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న విగ్రహాన్ని తొలగించడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారనేది పలు అనుమానాలకు తావిస్తోంది. వైఎస్‌ఆర్ విగ్రహం తొలగించమంటూ సీఎంవో నుంచి విశ్వవిద్యాలయానికి ఆదేశాలు వచ్చాయని రిజిస్ట్రార్ డా.రాధికా రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ పాలకమండలిలో పెట్టాకే నిర్ణయం తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకమండలి రద్దు అయ్యింది. కొత్త పాలకమండలి నియామకం జరిగాకే తొలగింపుపై నిర్ణయం తీసుకోగలమన్నారు.
అభయారణ్యాలపై కన్ను - ఎర్రచందనంతో పాటు వన్యప్రాణులు స్మగ్లింగ్
జగన్ పాలనలో మహిళలపై భారీగా నేరాలు - గణాంకాలతో సహా వెల్లడించిన టీడీపీ