Seaplane Trial Run From Vijayawada to Srisailam : విజయవాడ- శ్రీశైలం 'సీ ప్లేన్' ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట ఏపీలోని ప్రకాశం బ్యారేజ్ నుంచి సీప్లేన్ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయంలో సురక్షితంగా ల్యాండ్ కాగా అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్ చేరుకుంది. ఈ నేపథ్యంలో సీప్లేన్ ట్రయల్ రన్‌ను టూరిజం, పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో నిర్వహించారు.
రేపు పున్నమిఘాట్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ విజయవంతమైంది. కాగా ఏపీ సీఎం చంద్రబాబు రేపు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉదయం సీ ప్లేన్‌లో బయల్దేరి మధ్యాహ్నం శ్రీశైలం చేరుకుంటూరు. అక్కడే భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని అనంతరం మళ్లి సీ ప్లేన్‌లోనే విజయవాడ చేరుకోనున్నారు.
విజయవాడ - శ్రీశైలం - విజయవాడ మధ్య సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతమైతే రాబోయే రోజుల్లో కూడా రెగ్యులర్ సర్వీసు ప్రారంభించే దిశగా యోచిస్తున్నారు. ఏపీలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లన్న స్వామి దేవాలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా సీ ప్లేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సీ ప్లేన్ ప్రయాణం ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని అధికారులు అంటున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ : విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండో దశలో ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ రాష్ట్రంలో సాంకేతికంగా పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవలే జాతీయస్థాయి డ్రోన్ సమిట్‌ను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సీ ప్లేన్ కోసం ప్రయోగాలు చేపట్టారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు.
జలమార్గంలో విమానయానం - ఆ గుళ్లకు వెళ్లేవారికి థ్రిల్లింగ్ జర్నీ - ఎక్కడంటే?