Stella Ship Case Updates : కాకినాడ పోర్టులో బియ్యం దొంగల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ అన్ని విభాగాల అధికారులతో కూడిన ప్రత్యేక బృందం పశ్చిమాఫ్రికాకు బియ్యం తీసుకెళ్లే స్టెల్లా నౌకలోని సరుకును తనిఖీ చేయనుంది. కమిటీ నివేదిక ఆధారంగా ఆ షిప్ను సీజ్ చేయాలా? అందులోని సురుకును సీజ్ చేయాలా? అనేది తేల్చనున్నారు. స్టెల్లా ఎల్-పనామా-ఐఏంవో 9500687. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు బియ్యం నిల్వలతో వెళ్లే ఈ షిప్ చుట్టూ పెద్ద వివాదమే ముసురుకుంది. నౌకలో పేదల బియ్యం ఉన్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ గత నెల 27న ప్రకటించారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా గత నెల 29న కాకినాడ పోర్టును సందర్శించి సీజ్ ద షిప్ అని ఆదేశించారు. దీంతో అందరి దృష్టి కాకినాడ పోర్టుల వైపు మళ్లింది. పేదల బియ్యం అక్రమ ఎగుమతులపై రాష్ట్రంలో పెద్ద రగడే సాగుతోంది. ఈ పరిణామాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం కాకినాడ కేంద్రంగా గడచిన ఐదేళ్లు రెచ్చిపోయిన రేషన్ మాఫియా రెక్కలు విరిచేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా వివాదాస్పద నౌక నుంచే ప్రక్షాళన ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది.
PDS Rice Smuggling in Kakinada Port : ఈ నేపథ్యంలో ఇవాళ కస్టమ్స్, పోర్ట్ అథారిటీ, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం స్టెల్లా నౌకను తనిఖీ చేయనుంది. 52,000ల టన్నుల సామర్థ్యం ఉన్న ఈ షిప్లో ఇప్పటికే 38,000ల టన్నులు లోడైంది. అందులో పీడీఎస్ బియ్యం ఎంత? ఇతర నిల్వలు ఎంత? అనే లెక్కలు తీయనున్నారు. నౌకలో లోడ్ చేసిన బియ్యం ఏ ఎగుమతిదారు నుంచి వెళ్లింది? ఆయనకు ఏ మిల్లు సప్లై చేసింది? ఇన్నాళ్లూ వీటిని ఏ గోదాములో నిల్వచేశారనే కోణంలో ఆరా తీస్తారు.
విచారణ కమిటీ నివేదిక న్యాయ సలహాల ఆధారంగా నౌకను సీజ్ చేయాలా? అందులోని సరుకును మాత్రమే సీజ్ చేయాలా? అనేది నిర్ణయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కస్టమ్స్ యంత్రాంగం కూడా కాకినాడ పోర్టు రవాణాపై మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి కాకినాడ కస్టమ్స్ హౌస్‌లో అధికారులతో సమీక్షించారు. అక్రమ ఎగుమతులను ప్రోత్సహించవద్దని ఎగుమతిదారులను కోరారు.
వైఎస్సార్సీపీ 'సముద్రపు దొంగలు' - కాకినాడ పోర్టులో చినబాబురెడ్డి 'డి గ్యాంగ్' దందాలు
బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్