Officer Sent C VIGIL Complaint Details to YSRCP Leaders: ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రతి సారి ఒక కొత్త పద్ధతి తీసుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌరులను సైతం భాగస్వామ్యం చేస్తూ గత సాధారణ ఎన్నికల్లో సీ-విజిల్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఫిర్యాదుదారుల వివరాలు సైతం గోప్యంగా ఉంటాయి.
ఎన్నికల్లో జరిగే ఎటువంటి ఉల్లంఘనలైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలకు ఉపక్రమిస్తామని సీ-విజిల్ యాప్ గురించి ఎన్నికల సంఘం చాలా గొప్పగా చెప్పారు. సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సైతం అన్నారు. అయితే ఇంతటి గొప్ప ప్రయోజనాలు ఉన్న సీ- విజిల్ యాప్ ప్రతిష్ఠ కొంతమంది అధికారుల తీరు కారణంగా మసకబారుతున్నట్లు అనిపిస్తోంది.
ఆ ముగ్గురూ పూర్తి వివరాలతో రావాలి - రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాలు
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైసీపీ నాయకులకు ఓ అధికారి సమాచారం ఇచ్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో లైబ్రరీ, వాటర్ ప్లాంటుకు వైఎస్సార్సీపీ రంగులు ఉండటంతో స్థానికుడు ఫొటోలు తీసి సీ-విజిల్ యాప్‌లో ఈ నెల 19వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోల్లో ఫిర్యాదుదారుడితో పాటు ఆయన స్నేహితుడు సైతం ఉన్నారు.
దీనికి గంటలోపే అధికారులు స్పందించి వాటికి తెల్లరంగు వేయించారు. అయితే ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్న స్థానిక అధికారి ఒకరు ఆ ఫిర్యాదు చేసినవారి వివరాలు తెలిసేలా ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌షాట్ తీశారు. దాన్ని వైసీపీ నేతలకు పంపించారు. దీంతో ఫిర్యాదుదారుడి స్నేహితుడి సోదరుడికి వైసీపీ నాయకులు ఫోన్ చేసి దీనిపై ప్రశ్నించారు. ఈ విషయం ఫిర్యాదుదారుడికి తెలియడంతో సీ-విజిల్ యాప్‌లో బుధవారం మరోసారి ఫిర్యాదు చేశారు.
ఈసీ ఆదేశాలు లెక్కచేయని సచివాలయ ఉద్యోగులు - సామాజిక మాధ్యమాల్లో వైసీపీ అనుకూల ప్రచారం
దీనిపై ఆర్వో ఖాజావలి వివరణ ఇచ్చారు. సీ-విజిల్‌లో నమోదైన ఫిర్యాదును పరిష్కరించేందుకు ఫ్లయింగ్ సర్వెలెన్స్ బృందం లొకేషన్ అడగడంతో ఫిర్యాదుదారు వివరాలతో కూడిన స్క్రీన్‌షాట్‌ను జూనియర్ అసిస్టెంట్ వాట్సప్ గ్రూపులో పెట్టారని తెలిపారు. అప్పుడే అది బహిర్గతమైందని అన్నారు. ప్రధాన అధికారికి వ్యక్తిగతంగా పంపితే సరిపోయేదని, అయితే ఇది కావాలని చేసిన పని కాదని, జూనియర్ అసిస్టెంట్‌కి షోకాజ్ నోటీసు ఇచ్చామని తెలిపారు.
అధికారుల కళ్లకు గంతలు- వైసీపీ వ్యూహంతో ఓటర్లకు ఊహించని తాయిలాలు