Oberoi Hotels Team Visit: టెంపుల్ టూరిజంతో పాటు పూర్తిస్థాయిలో టూరిస్ట్ హబ్‌గా ఏపీని మారుస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలోని పర్యాటక ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యానందరావుతో పాటు ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులతో కలిసి సందర్శించారు.
ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఉన్న 56 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ ప్రతినిధులు పరిశీలించారు. కాటన్ బ్యారేజ్ వద్ద ఉన్న గోదావరి అందాలను తిలకించారు. గోదావరి వరద ఉద్ధృతి, స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి ప్రతినిధులకు వివరించారు. ఈ ప్రాంతంలో ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలైన కాకినాడలోని హోప్ ఐలాండ్ కోరంగి అభయారణ్యం, కోనసీమ అందాలు, కడియం నర్సరీలు, మారేడుమిల్లి ఎకో టూరిజం, తదితర ప్రాంతాలను ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులకు వివరించారు.
పర్యాటక హబ్‌గా అమరావతి - రూ. 500 కోట్లతో ప్రణాళికలు - Amaravati Tourism Development
అత్యధిక జనాభా ఉన్న గోదావరి జిల్లాల్లో టూరిజం అభివృద్ధి వల్ల కలిగే ప్రయోజనాలను ఒబెరాయ్ సంస్థల ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, గండికోటల్లో రిసార్ట్లు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఇప్పటికే అంగీకారం తెలిపిందన్న మంత్రి, అదే తరహాలో పిచ్చుకలంకలోనూ రిసార్ట్లు నిర్మిస్తే పర్యాటకంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అదే విధంగా మదనపల్లె హార్స్ లీ హిల్స్‌లోనూ రిసార్ట్స్ నిర్మిస్తే బాగుంటుందన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించామన్న ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు, త్వరలోనే ఆచరణాత్మక ప్రణాళికతో వస్తామని తెలిపారు.
"ఇక్కడ మీరు ఒక్కసారి టూరిజం స్పాట్‌గా గుర్తించి రిసార్ట్లు నిర్మించగలిగితే ఉభయ గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చే ఆలయాలు ఉన్నాయి. కేరళను మించిన పర్యాటక అందాలు గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడక వచ్చిన వారు ఒకరోజు ఆలయాలు చూసి వెళ్లిపోకుండా, రెండు మూడు రోజుల పాటు ఉండి పర్యాటక ప్రాంతాలు చూసి వెళ్లేలా చూస్తున్నాము. ఇందుకోసం దీనికి సంబంధించిన అన్ని అంశాలను ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులకు వివరించాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో టూరిజం డిపార్టుమెంట్ ద్వారా పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తాం. రాబోయే రోజుల్లో ఇక్కడకు ఒబెరాయ్ వారు వస్తారని నూటికి నూరు శాతం మేము నమ్ముతున్నాము". - కందుల దుర్గేష్, మంత్రి
'వంద రోజుల్లో వంద కోట్లు' - సూర్యలంక బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక - SURYALANKA BEACH