Nuzvid IIIT College Food Incident: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం ఇలా పలు లక్షణాలతో విద్యార్థులు కుప్పకూలిపోతున్నారు. గురువారం సైతం సుమారు 194 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారం నుంచి వందల మంది అనారోగ్యం పాలవుతున్నా అధికారులలో మాత్రం చలనం రావడం లేదు. బుధవారం మంత్రి పార్ధసారథి (Minister Parthasarathy IIIT Visit) ట్రిపుల్ ఐటీలో పర్యటించి మెస్ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా తీరు మాత్రం మారలేదు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 23వ తేదీన విద్యార్థులకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 1,194 మంది విద్యార్థులు అస్వస్థతకు (Students Fell Ill in Nuzvid IIIT) గురయ్యారు. మంత్రి ట్రిపుల్ ఐటీలో పర్యటించి, మెస్‌ను పరిశీలించారు. విద్యార్థులు, అధికారులతో సమావేశమైన మంత్రి, మెస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మెస్ నిర్వాహకులు మాత్రం మంత్రి వస్తే మాకేంటి అన్నట్లు వ్యవహరించారు.
ఆహారంలో ఎటువంటి మార్పులేదు. గురువారం ఉదయం సైతం పాడైన గుడ్లు, రుచీపచీ లేని ఉప్మా వడ్డించారు. మధ్యాహ్నం అయినా మార్పు ఉంటుందను కుంటే మాడిపోయిన బెండకాయ కూర, నీళ్ల పెరుగు వడ్డించారు. అన్నంలో పురుగులు ఉండటం విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేసింది.
సౌకర్యాలు అరకొరగానే: దీనికి తోడు ట్రిపుల్ ఐటీలో ఆసుపత్రుల్లో సౌకర్యాలు కూడా అరకొరగానే ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఆసుపత్రికి వస్తున్న వారి వివరాలు నమోదు చేయకుండా ఓపీ తక్కువగా చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆరోగ్యం విషమించిన వారిని సైతం అక్కడ ఇన్ పేషెంట్లుగా ఉంచకుండా మందులు ఇచ్చి పంపేస్తున్నారని మండిపడుతున్నారు. ఆసుపత్రిలో కనీసం ఓఆర్ఎస్ కూడా ఉండటం లేదని, 20 పడకలు మాత్రమే ఉన్నాయన్నారు. దీంతో దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు మెరుగైన వైద్యం కోసం ఇంటికి వెళ్లిపోయారు. అధికారులు మాత్రం కొద్దిమందే బయటికు వెళ్లారని చెప్తున్నారు.
తనిఖీలు చేస్తే ప్రయోజనం ఏమిటి?: ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు పడుతున్న సమస్యలు వెలుగులోకి వచ్చాక అధికారులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మెస్ పరిస్థితులు, ఆహారం నాణ్యత పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డీఎంహెచ్వో, వైద్య ఆరోగ్యశాఖ జేడీ మల్లేశ్వరి వచ్చి మెస్‌లో ఆహార నాణ్యతను పరిశీలించారు. ఎంత మంది అధికారులు వచ్చి పరిశీలించినా మెస్ నిర్వహణలో మార్పు రాకపోతే ప్రయోజనం ఏముందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి వచ్చారు కదా, కనీసం ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం చేద్దామనుకుంటే, మార్పు ఏమీ కనిపించలేదని ఆవేదన చెందుతున్నారు.