Story On Peddapalli District : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని లంబాడి తండా(బీ) గ్రామంలో ప్రస్తుతం 301 ఇళ్లు, 1,213 మంది జనాభా ఉన్నారు. అయితే ఆ ఊరిలో 61 మంది ఉద్యోగులుగా, వివిధ విభాగాల్లో పని చేయడం విశేషం. ఇంతలా మార్పు సాధించిన ఆ తండా కథ ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుంది.
నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో : 1984 వరకు ఈ గిరిజన తండాలో కరెంటే లేదు. గతంలో బంజరుపల్లి పంచాయతీకి అనుబంధంగా ఈ తండా ఉండేది. అప్పట్లో చదువుకోవాలంటే 8 కి.మీ. దూరం నడుచుకుంటూ పత్తిపాక అనే గ్రామానికి వెళ్లే పరిస్థితి. దీంతో అంత దూరం వెళ్లలేక పిల్లలు, యువకులు దగ్గర్లో ఉన్న బంజరుపల్లి, పెరుకపల్లి, కటికెనపల్లి గ్రామాల రైతుల వద్ద పని చేసేవారు.
కాలం మారింది - తండాకు మంచి రోజులొచ్చాయ్ : కొన్ని సంవత్సరాల క్రితం పత్తిపాక పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన ఈ తండాలోని నలుగురు యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. వాళ్లే ఆ తండాకు ఆదర్శంగా నిలిచారు. చదువు విలువను వారి తోటివారికి తెలియజేస్తూ వారిలో చైతన్యాన్ని నింపారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పని మాన్పించి, బడిలో చేర్పించడం ప్రారంభించారు. తండాలోని ప్రతి ఒక్కరూ కూరగాయల సాగును మొదలుపెట్టారు. వచ్చిన ఆదాయంతో పిల్లలను చదివించారు. పిల్లలు సైతం తల్లిదండ్రుల కష్టాన్ని అర్ధం చేసుకుని పట్టుదలతో చదువుకున్నారు. ఫలితంగా గ్రామంలోని యువకులందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం తండాలోని 60 మందికి పైగా వివిధ శాఖల్లో ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. విద్యాభివృద్ధిలోనే కాకుండా అన్ని విధాలుగా తండా ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఈ గ్రామ ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది.
గ్రామంలో ఉపాధ్యాయులుగా 11 మంది, జూనియర్ లెక్చరర్లుగా ఇద్దరు, డిగ్రీ లెక్చరర్‌గా ఒకరు, పోలీసు కానిస్టేబుళ్లుగా 16 మంది, వైద్య శాఖలో ఇద్దరు, సైన్యంలో నలుగురు, ఆర్టీసీలో నలుగురు, నాలుగో తరగతి ఉద్యోగులుగా ముగ్గురు, విద్యుత్తు శాఖలో నలుగురు, సింగరేణిలో 8 మంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నలుగురు, బ్యాంకుల్లో ఇద్దరు చొప్పున పనిచేస్తున్నారు. ఇద్దరు మాత్రమే ప్రైవేటు ఉద్యోగులున్నారు. మరో నలుగురు ఉద్యోగ విరమణ చేశారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు.