CM and Ministers Photos Not Appearing in Websites : జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అమాత్యులంతా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పాలనపై దృష్టి పెట్టి వారి శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సాధారణంగా కొత్త ప్రభుత్వ పాలన ప్రారంభమైన వెంటనే అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లు, యాప్‌లలో సీఎం సహా సంబంధిత మంత్రి ఫొటోలను తప్పక పొందుపరచి ప్రదర్శించాలి. ప్రజలకు ఈ వివరాలను తెలియజేయల్సిన బాధ్యత సంబంధిత విభాగాల అధిపతులపైనే ఉంటుంది.
CM and Ministers Photos in AP : కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 వారాలు గడిచినా ఇప్పటికీ ఆ దిశగా దృష్టి పెట్టకపోవడం చర్చనీయాంశమైంది. కీలకమైన ప్రభుత్వ వెబ్సైట్లలో ఎక్కడా సీఎం సహా మంత్రుల ఫొటోలను సంబంధిత శాఖల అధికారులు వివరాలు అప్‌లోడ్ చేయలేదు. కీలకమైన గ్రామ వార్డు సచివాలయం విభాగానికి సంబంధించి వెబ్‌సైట్‌లో సీఎం సహా మంత్రుల చిత్రాలు పొందుపరచలేదు. మీ సేవా పోర్టల్లోనూ ఫొటోలు కనిపించడం లేదు.
ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ సైట్‌లో ఎక్కడా సీఎం చంద్రబాబు సహా సంబంధిత మంత్రి నాదెండ్ల మనోహర్ ఫొటో లేదు. ఏపీ డిఫికల్టీ ఏబుల్డ్, సీనియర్ సిటిజన్స్ అసిస్టెంట్స్ కార్పొరేషన్ , ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ, ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రుల చిత్రాలు ఎక్కడా పొందుపరచలేదు. పోలీసు విభాగంలో ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌లో సీఎం సహా హోంమంత్రి అనిత ఫొటోల జాడ లేదు. ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లోనూ ఇదే పరిస్థితి.
రవాణాశాఖలోనూ సీఎం చంద్రబాబు సహా సంబంధిత మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఫొటో ఎక్కడా కనిపించడం లేదు. మంత్రి లోకేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ వెబ్‌సైట్‌లో, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లోనూ లోకేశ్ సహా సీఎం ఫొటోలు ఎక్కడా కనిపించడం లేదు. విశాఖపట్నం మెట్రో పాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ వెబ్సైట్లోనూ అప్‌డేట్ చేయలేదు.
కనిపించి కనపడనట్లుగా ఫొటోలు : జిల్లాల పేర్లతో అధికారుల వివరాలను తెలిపేందుకు నిర్వహిస్తోన్న వెబ్‌సైట్లలోనూ ఇదే తంతు కనిపిస్తోంది. సీఎం సొంత జిల్లా చిత్తూరుకు సంబంధించి జిల్లా కలెక్టర్ వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ఇంకా అప్‌లోడ్ చేయలేదు. తూర్పుగోదావరి సహా పలు జిల్లాల వెబ్ సైట్లలోనూ సీఎం ఫొటో ఇప్పటికీ కనిపించడం లేదు. కొన్నింటిలో ఫొటోలు పొందుపరచినా కనిపించి కనపడనట్లుగా పెట్టారు. అందులో మంత్రుల ఫొటోలు , వివరాలు విస్మరించారు.
గత ప్రభుత్వంలో కొందరు అధికారులు అవసరం లేని చోట కూడా అప్పటి సీఎం జగన్ ఫొటోలతో నింపేశారు. ప్రభుత్వం మారినా కొందరు వైఎస్సార్సీపీ భక్త అధికారులు, ప్రస్తుత సీఎం చంద్రబాబు సహా మంత్రుల ఫొటోలను వెబ్‌సైట్లు, యాప్‌లలో పొందుపరచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అన్ని వివరాలు సత్వరం అప్‌లోడ్ చేయాలని కోరుతున్నారు.