Northern Shoveler Bird Changing Colors In Kolleru Lake : రంగు రంగుల శరీర ఆకృతులతో చూపరులను ఇట్టే ఆకర్షించే కొల్లేరు సరస్సు అందాల అతిథి నార్తరన్ షవెల్లర్. ఇది అచ్చం బాతు ఆకారంతో ఉండి ముక్కు తెడ్డులా ఉంటుంది. దీంతో స్థానికులు దీనిని తెడ్డుమూతి బాతుగా పిలుస్తుంటారు. ఇది 44 నుంచి 52 సెం.మీ పొడవు ఉంటుంది. అలాగే 600 గ్రాముల బరువుతో మగ, ఆడ పక్షులు వివిధ రంగుల్లో కనువిందు చేస్తుంటాయి. వీటి ముక్కు నల్లగా ఉంటే మగ పక్షిగా గుర్తించాలి.
ముక్కు ఎరుపు రంగులో ఉండి శరీరమంతా గోధుమ వర్ణంతో మచ్చలు ఉంటే ఆడ పక్షిగా భావించాలి. ఇవి జార్జియా, ఉక్రెయిన్ దక్షిణ ఆసియాల్లో ఎక్కువగా నివసిస్తాయి. శీతాకాలంలో మాత్రమే మనదేశంతో పాటు ఇరాక్, ఇరాన్, థాయిల్యాండ్, పాకిస్తాన్, మలేసియా, చైనా ప్రాంతాలకు వలస వస్తాయి. ఈ నార్తరన్ షవెల్లర్లు నీటి మొక్కలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. మగ పక్షి ఆకర్షణీయంగా కనిపించేందుకు వివిధ వర్ణాలను మార్చుకుంటుంది.