CM Jagan Election Campaign: పరదాల మాటున పర్యటనలు చేసి, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లిపోవడం అలవాటుగా మార్చుకున్న సీఎం జగన్ ఓట్ల కోసం బస్సుయాత్ర పేరుతో జనాల్లోకి వచ్చారు. బస్సుయాత్రలోనూ ఐప్యాక్ ఏర్పాటు చేసిన మనుషులతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడటం లేదు. అనంత జిల్లాలో ఆయన ఏసీ బస్సులో కూర్చుని కనబడిన జనాలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఎక్కడైనా వైసీపీ శ్రేణులు మరీ బలవంతపెడితే తప్ప బస్సు దిగలేదు.
'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర మార్చి 30న అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో ప్రవేశించింది. ఆరోజు సాయంత్రం జిల్లాలో ప్రధాన పట్టణమైన గుత్తి మీదుగా సాగింది. ఆయన ఏం మాట్లాడకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశతో వెనుదిరిగాయి. పామిడి, కల్లూరు, గార్లదిన్నె మీదుగా రాత్రి 10 గంటలకు అనంతపురం చేరుకున్నారు. కేవలం అభివాదాలతో సరిపెడుతూ ముందుకు సాగారు. రాత్రి 11:30 గంటలకు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి చేరుకున్నారు.
జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్, జయకృష్ణ - Mandali Buddha Prasad into Janasena
31న ఈస్టర్ సందర్భంగా యాత్రకు విరామం ఇచ్చారు. ఆ రోజంతా జగన్ విడిది కేంద్రంలోనే ఉన్నా ఏ ఒక్కరినీ కలవలేదు. భద్రతా సిబ్బంది సామాన్యులను అటువైపునకూ రానివ్వలేదు. సోమవారం ఉదయం బస్సుయాత్ర మొదలై బత్తలపల్లి, ముదిగుబ్బ, మలకవేముల క్రాస్ మీదుగా సాయంత్రం 6 గంటలకు కదిరి చేరుకుంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో 180 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర కొనసాగినా సీఎం జగన్ ఒక్కమాటా మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ అనంతపురం జిల్లాకు వందల హామీలు గుప్పించారు. అయిదేళ్లలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అధికారంలోకి వస్తే రెండేళ్లలో హంద్రీనీవా పూర్తిచేస్తామని, జీడిపల్లి-పేరూరు, జీడిపల్లి-బైరవానితిప్ప ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చారు. జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని ప్రగల్భాలు పలికారు. పట్టు రైతులకు ప్రోత్సాహకాలు పెంచుతామని, వేరుశనగకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని రైతుల్ని నమ్మించారు.
జగన్‌ను నమ్మిన అనంతవాసులు 12 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. అధికారంలోకి వచ్చాక హామీల అమలుకు ఏనాడూ కృషి చేయలేదు. దీంతో పాటు సీఎం హోదాలో అనంతపురం జిల్లాలో 7 సార్లు పర్యటించి పలు హామీలు గుప్పించారు. అవీ అమలుకు నోచుకోలేదు. వీటిపై జిల్లా వాసులు నిలదీస్తారనే భయంతోనే బస్సుయాత్రలో ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.