No Governing Body in Jamalapuram Sri Venkateswara Temple : తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో అతి పెద్ద దేవాలయం, తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఆలయం ఇన్‌ఛార్జి అధికారుల పాలనలో కొనసాగుతోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా పాలకమండలి నియామకం లేకపోవడంతో ఆలయ పర్యవేక్షణ కరవైంది. అభివృద్ధి పనులకు కార్యరూపం దాల్చక, సకాలంలో సమస్యలు పరిష్కారం భక్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీవారి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆలయ విశిష్టత : ఖమ్మం ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి 62.5 ఎకరాల మాన్యం ఉంది. అన్నదానానికి 3 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సైతం ఉన్నాయి. ఈ డిపాజిట్లతో వచ్చిన వడ్డీతోనే భక్తులకు అన్నదానం అందిస్తున్నారు. ఆలయానికి హుండీ, టిక్కెట్లు, దుకాణాల, తలనీలాల వేలం ద్వారా ఏటా దాదాపు 6 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇంతి స్థితి ఉన్నా అందుకు తగ్గట్లుగా సరైన సదుపాయాలు లేవని, ప్రాచుర్యం సమకూరటం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏం చేయాలి : శ్రీవారి దేవాలయానికి సహాయ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. ఖమ్మంలో నరసింహస్వామి ఆలయ గ్రేడ్-2 ఈఓ జగన్మోహన్‌రావు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. మధిర శివాలయం, మారెమ్మ ఆలయం, కూసుమంచి జీళ్లచెర్వు ఆలయాల బాధ్యతలూ ఆయనే నిర్వర్తిస్తున్నారు. దీంతో స్థానిక దేవాలయంలో నిరంతర పర్యవేక్షణ కరవైంది.
ప్రత్యేక రాష్ట్రం రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీవారి ఆలయానికి ఒక్కసారే పాలకవర్గాని ఏర్పాటు చేశారు. దాదాపు ఎనిమిదేళ్లుగా పాలకవర్గం లేదు. దీంతో ఆలయ అభివృద్ధికి నిధులు కోరే వారే కరవయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చేలా కొత్త పాలకవర్గం ఏర్పాటు చేయాలని, వసతి పెంచాలని భక్తులు వేడుకుంటున్నారు.
'దేవాదాయ శాఖలో కొన్నేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఇతర ఆలయాలకు కూడా ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఆలయ పర్యవేక్షణ చేస్తున్నాం. పాలకమండలి ఏర్పాటు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి'- కె.జగన్మోహన్‌రావు, ఆలయ ఈఓ
పేరుకుపోతున్న సమస్యలు
- ఆలయ ప్రాభవాన్ని పెంచే నేపథ్యంలో చుట్టూ ప్రాకార మండపం, గిరిప్రదక్షిణకు మాడవీధులు, మూడు వైపులా రాజగోపురాలు నిర్మించాలని గతేడాది ఆలయ ధర్మకర్తలు, అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికీ ఈ విషయంలో ఇసుమంత పురోగతి కూడా లేదు.
- ఆలయ ప్రాంగణంలో భక్తులు స్నానమాచరించేందుకు రూ.40 లక్షలతో దాతలు నిర్మించిన పుష్కరిణి నిరుపయోగంగా ఉంటోంది. దీన్ని వినియోగంలోకి తీసుకురావాలి.
- కొండ కింద వాహనల పార్కింగ్‌కు ప్రత్యేక షెడ్లు లేవు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పార్కింగ్ విషయంలోనూ ఇబ్బందులకు గురవుతున్నారు.
- సాధారణ రోజుల్లో 150 మందికి మాత్రమే అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఈ సంఖ్య సుమారు 250కు పెంచాలి. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఉంటుంది, అందుకు 300 టోకెన్ల నుంచి 500కు చేయాలి.
- పర్యవేక్షణ లేకపోవడంతో విధి నిర్వహణలో కూడా కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి.