Amaravati ORR Updates : రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. రూ.25,000ల కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఐ అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్టు అలైన్‌మెంట్, డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ఓఆర్ఆర్ పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు.
రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్‌మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ- ఎన్హెచ్ఐ దృష్టిపెట్టింది. 2018లోనే దీని ఎలైన్‌మెంట్ ఖరారు చేయగా, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ రాజధానిపై అక్కసుతో ఓఆర్ఆర్ను పక్కనపెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. ఓఆర్‌ఆర్‌కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.
Central on Amaravati ORR : 189 కిలోమీటర్లు ఉండే ఓఆర్‌ఆర్‌కు గతంలో ఆర్వీ అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్‌మెంట్ రూపకల్పన, డీపీఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలోనే ఎన్హెచ్ఐని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతివ్వాలని ఎన్హెచ్ఐ అధికారులు దిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి వచ్చింది. ఆర్వీ సంస్థతో ఈ వారంలో ఎన్హెచ్ఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు.
ఓఆర్ఆర్ నిర్మాణానికి 2018 నాటి అంచనా ప్రకారం రూ.17,761 కోట్లు. 3404 హెక్టార్ల భూసేకరణకు రూ.4198 కోట్లు అవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.20,000ల కోట్లకు పెరిగింది. భూసేకరణకు సుమారు రూ.5000ల కోట్లు కలిపి ఓఆర్ఆర్ నిర్మాణానికి రూ.25,000ల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం షరతుపెట్టగా ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్రప్రభుత్వం సమ్మతించింది.
భూసేకరణ భారం లేదు : ఈ క్రమంలోనే భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారుల్ని నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఐ అధికారులు లేఖలు రాశారు. అలైన్‌మెంట్, డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించనున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం 80-90 శాతం భూసేకరణ జరిగితే టెండర్లు పూర్తిచేసి, గుత్తేదార్లకు పనులు అప్పగిస్తారు. ఎంత త్వరగా భూసేకరణ పూర్తయితే, అంతేవేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.
రాజధాని అమరావతి కలుపుకొంటూ జాతీయ రహదారి-16 నిర్మాణం - National Highway Near By Amaravati
అమరావతికి రూ.15000 కోట్లు- పూర్తి బాధ్యత కేంద్రానిదే! - World Bank Loan to Amaravati