Gullalamoda Missile Testing Center Move to Gujarat? : వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలకు ప్రైవేటు పరిశ్రమలే కాదు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు సైతం ఏపీ నుంచి వెళ్లిపోయే పరిస్థితి దాపురించింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కొరవడిన కారణంగా కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయదలిచిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని గుజరాత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం క్షిపణి పరీక్ష కేంద్రంగా ఉన్న ఒడిశాలోని బాలాసోర్ కంటే, అనువైన ప్రాంతం కోసం అన్వేషించిన కేంద్ర రక్షణ శాఖ 2011లో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోద గ్రామాన్ని ఎంపిక చేసింది. ఇక్కడ 386 ఎకరాలు కావాలని డీఆర్‌డీవో 2012లో ప్రతిపాదించగా, అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించారు. 2017లో ఏటిమొగ రెవెన్యూ గ్రామ పరిధిలోని అభయారణ్యంలో 381.61 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం డీఆర్‌డీవోకు కేటాయించింది. దీనికి బదులుగా గణపేశ్వరం పరిధిలోని అంతే రెవెన్యూ భూమిని అటవీ శాఖకు అప్పగిస్తూ, జీవో 1352 ఇచ్చింది. 2017లోనే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తొలి దశ అనుమతులు వచ్చాయి. 2018లో సీఆర్‌జడ్ నుంచి కూడా మినహాయింపు తీసుకున్నారు.
2019లో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి రెండో దశ అనుమతులు లభించగా, 2020-21లో ఆ స్థలాన్ని డీఆర్‌డీవో స్వాధీనం చేసుకొని ప్రహరీని, ఓ భవనాన్ని నిర్మించింది. తర్వాత ఎలాంటి పురోగతీ లేదు. క్షిపణి కేంద్రానికి వచ్చే ప్రముఖులకు అతిథి గృహం, శాస్త్రవేత్తలకు నివాస సముదాయం కోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలో కొంత భూమి కావాలని డీఆర్‌డీవో ప్రభుత్వానికి లేఖ రాయగా, నాటి సీఎం జగన్ పట్టించుకోలేదు. డీఆర్‌డీవో ఛైర్మన్‌గా ఉన్న సతీష్‌రెడ్డి పలుమార్లు నాగాయలంకను సందర్శించారు. 2021 జులైలో వచ్చినప్పుడు త్వరలోనే నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ శాస్త్ర సలహాదారుగా ఉన్న ఆయన క్షిపణి పరీక్ష కేంద్రం తరలిపోకుండా ప్రయత్నిస్తున్నామని ఇటీవల చెప్పారు.
శ్రీహరికోటలోని షార్ తరహాలో ఇక్కడా అంతరిక్ష పరీక్ష కేంద్రం అభివృద్ధికి అవకాశముంది. తొలి దశలో సుమారు 1,800 కోట్ల వెచ్చించాలని కేంద్రం ప్రణాళికలు వేసింది. ఐదేళ్లుగా జగన్ సర్కారు స్పందించని కారణంగా, ఈ కేంద్రాన్ని గుజరాత్‌కు తరలించాలనే యోచనలో డీఆర్‌డీవో ఉన్నట్లు తెలిసింది. దీనిపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. క్షిపణి పరీక్షా కేంద్రాన్ని గుజరాత్‌కు తరలించాలన్న ప్రతిపాదనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వారు ప్రధానితో చర్చించి, కేంద్రాన్ని ఇక్కడే కొనసాగిస్తారన్న విశ్వాసముందన్నారు.