Nellore Youth Beach Kabaddi: సముద్ర తీరప్రాంతాల్లో ఇసుకలో ఆడే ఆటను బీచ్ కబడ్డీ అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు బీచ్ కబడ్డీ ఆడటానికి ఎంతో ఇష్టపడతారు. యువత దీనిపై ఎక్కువ శిక్షణ తీసుకుంటారు. నెల్లూరు నగరంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కావలి నుంచి తడ వరకు తీరప్రాంతాల్లో యువత శిక్షణ పొందుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీచ్ కబడ్డీ యువ క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ అందుకున్నారు.
జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన యువతీ యువకులతో బీచ్ కబడ్డీ టీమ్ గత కొన్నేళ్లుగా అనేక విజయాలను సొంతం చేసుకుంది. ఈ సింహపురి టీమ్ జాతీయ స్థాయిలో పోటీలకు సిద్ధం అవుతున్నారు. పురుషులు, మహిళలు రెండు బృందాలుగా జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం అవుతున్నారు. వీరంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో మెడల్స్ సాధించారు. నెల్లూరు, కావలి, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట మండలాలకు చెందిన ఈ బృందంలోని యువకులు అందరూ వివిధ కళాశాలల్లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇరాన్లో జరగబోయే అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం అవుతున్నారు.
నెల్లూరు జిల్లాలో మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలు
ఇక్కడి యువకులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. కబడ్డీ క్రీడాకారులు అంటేనే ఎక్కువగా గ్రామాల నుంచి వచ్చి శిక్షణ పొందడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీరు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని తపన పడుతున్నారు. ఒక్కొక్కరూ 8 ఏళ్లుగా బీచ్ కబడ్డీ పోటీల్లో అనేక రాష్ట్రాల్లో పాల్గొన్నారు. చదువులోనూ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నందున ఉపయోగపడతాయని క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తున్నామని అంటున్నారు.
శారీరక దృఢత్వం, మానసిక ఎదుగుదలకు క్రీడలు ఎంతో అవసరమని వారు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటేనే యువతులు మైదానాలకు రాగలరని అంటున్నారు. బీచ్ కబడ్డీ పోటీలను చూడటానికి ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతో ప్రాచుర్యం పొందిన బీచ్ కబడ్డీ యువ క్రీడాకారులను ప్రభుత్వం ప్రొత్సహించి వారికి ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కారించాలని కోరుతున్నారు. దీంతోపాటు ఆటకు కావలసిన వసతులు కల్పించాలని ఈ యువ క్రీడాకారులు విన్నవిస్తున్నారు.
రాష్ట్రస్థాయి మహిళా ప్రో కబడ్డీ పోటీల్లో విజేతగా విజయనగరం జిల్లా జట్టు