Bharata Natyam Artists Got Place in Guinness Record: భరతనాట్యం అంటే నృత్యకళ మాత్రమే కాదని ఆలోచనలను భావరూపంలో వ్యక్తపరిచే కళాత్మక సాధనం అంటున్నారు ఈ యువతులు. వేదికలపై ఔరా అనిపించేలా నాట్యంతో గిన్నిస్ రికార్డునూ ఖాతాలో వేసుకున్నారు. చదువుకుంటూనే దేశంలో వివిధ చోట్ల ప్రదర్శనలిస్తూ కళాసేవ చేస్తున్నారు. ఉత్తమ నృత్యకారిణులుగా పేరు తెచ్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
లయబద్ధంగా నృత్యాన్ని అభినయిస్తున్న ఈ నలుగురు యువతులు చిన్నవయసులోనే భరతనాట్యంలో అద్భుత ప్రావీణ్యం కనబరుస్తున్నారు. నెల్లూరుకు చెందిన వీరంతా నగరంలోని గురుకృపా కళాక్షేత్రంలో సురభి గాయత్రి వద్ద నృత్యాన్ని అభ్యసిస్తున్నారు. భరతనాట్యంలో పలు నృత్యరీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
వారిలో బీటెక్ చదువుతున్న పూజ 14 ఏళ్లుగా భరతనాట్యంలో శిక్షణ పొందుతోంది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే 300లకు పైగా ప్రదర్శనలు ఇచ్చి నృత్యఝరి సహా ఎన్నో అవార్డులు అందుకుంది. తోటి స్నేహితులతో కలసి గిన్నిస్ రికార్డునూ సొంతం చేసుకుంది. విదేశాల్లోనూ శాస్త్రీయ నృత్యం గొప్పదనం చాటడమే ఆశయమని చెబుతోంది.
కళ్లు చెదిరిపోయే రేంజ్లో శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్ - మీరు చూశారా?
భారతీయ సంస్కృతికి ప్రతిరూపమైన భరతనాట్యంలో 14 ఏళ్ల నుంచి శిక్షణ పొందుతోంది మోక్షిత రాజేశ్వరి. ఇష్టంతో చేసే ఏ పనైనా కష్టంగా అనిపించదని, అందుకే చదువుకుంటూనే 400 పైగా ప్రదర్శనలు ఇవ్వగలిగానని చెబుతోంది. శ్రీశైలంలో నాదనీరాజనం, తిరుపతి బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తానని అంటోంది.
నేటి యువత పాశ్చాత్య కళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, చిన్నతనంలో సరదాగా నేర్చుకోవడం మొదలుపెట్టిన తనకు భరతనాట్యం గొప్పదనమేంటో తెలిసిందంటోంది శివసాయి చరిత. ఇంజినీరింగ్ చదువుతూనే భరతనాట్యంలో డిప్లొమా కోర్సును పూర్తిచేసిందీ అమ్మాయి. దేశంలో వివిధ చోట్ల వందల ప్రదర్శలతో నృత్య సమ్మాన్ , నృత్యఝరి అవార్డులు అందుకుంది.
రాజీపావని దేశవ్యాప్తంగా 400లకు పైగా నృత్యప్రదర్శనలు ఇచ్చి నాట్యచంద్రిక, నృత్యఝరి, నృత్యసమ్మాన్ అవార్డులు సాధించింది. సంప్రదాయ కళలు మానసిక ఆరోగ్యాన్ని చేకూర్చి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయని అంటోంది.
చదువులపైనే కాక యువత ఏదొక కళను అభ్యసించాలని సూచిస్తున్నారు ఈ యువతులు. అభిరుచులను జీవితంలో భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ ప్రచారం చేయాలని ధ్యేయంగా పెట్టుకున్నారు వీరంతా.
"నేటి యువతులు చిన్ననాటి నుంచే భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవాలి. భరత నాట్యం ఎంతో గొప్పది. నాట్యం ఆనందాన్ని కలిగించి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శాస్త్రీయ నృత్యం అంతరించిపోకుండా ఇతర దేశాల్లో ప్రదర్శనలిచ్చి, భరతనాట్యం ప్రచారం చేయాలనేదే మా లక్ష్యం." - భరతనాట్య కళాకారిణులు
మాతృభూమిపై అనురాగాన్ని ఇలా చాటుకున్న ఎన్నారై దంపతులు - Classical Dance Debut