Nellore Bara Shaheed Dargah Overlooking Dumping Yard: దేశంలో రొట్టెల పండుగ అంటే గుర్తు వచ్చే పేరు నెల్లూరు బారాషహీద్ దర్గా. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు దర్గాను సందర్శిస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రాంతం నేడు డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో స్వర్ణాల చెరువు, పరిసర ప్రాంతాలు వ్యర్థాలతో నిండిపోయాయి. దర్గా పర్యవేక్షణను గాలికొదిలేయడంపై భక్తులు, నెల్లూరు వాసులు మండిపడుతున్నారు.
కోరికలు తీర్చే రొట్టెల పండుగ.. మతసామరస్యానికి ప్రతీక
డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న బారాషహీద్ దర్గా: హిందూ, ముస్లింలు పవిత్రంగా భావించే రొట్టెల పండుగ జరిగే ప్రాంతమైన బారాషహీద్ దర్గాలో పరిశుభ్రత దారుణంగా ఉంది. కేవలం రొట్టెల పండుగ సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులు ఈ దర్గాను సందర్శిస్తుంటారు. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాల్సిన అధికారులు దర్గా పరిశుభ్రతను గాలికొదిలేయడంతో పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోయి, దుర్గంధం వెదజల్లుతున్నాయి. పవిత్ర స్నానాలు చేసే స్వర్ణాల చెరువు వ్యర్ధాలతో నిండిపోయింది.
Rottela Panduga in Nellore: నెల్లూరులో ఘనంగా గంధమహోత్సవం.. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు
వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు: బారాషహీద్ దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పది కోట్ల రూపాయలతో పార్కు, స్నానాల గదులు, విశ్రాంతి గదులు నిర్మించారు. దర్గాకు వచ్చే భక్తులకు ఇవి ఎంతో ఉపయోగంగా ఉండేవి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు దర్గా పరిశుభ్రత, పర్యవేక్షణను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయి. సమీప ప్రాంతాల్లోని చెత్తను సైతం తీసుకువచ్చి దర్గా చుట్టు పక్కలే పడేస్తున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Rottela Panduga: బారాషహీద్ దర్గా వద్ద వేడుకగా గంధమహోత్సవం.. పోటెత్తిన భక్తజనం
పొదలకూరు రోడ్డులోని చెత్త అంతా తీసుకువచ్చి దర్గా దగ్గరే పడేస్తున్నారు. కొందరు రాత్రి, పగలు ఇక్కడే మద్యం సేవిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వచ్చే భక్తులు దర్గా వద్ద ఐదు రోజులు ఉండటం ఆనవాయితీ. పరిసరాలు అపరిశుబ్రంగా ఉండటంతో ఒక్కరోజు మాత్రమే ఉండి మొక్కులు చెల్లించుకుని వెళ్తున్నారు. రొట్టెల పండుగకు మాత్రమే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు తప్ప ఆ తరువాత దర్గా బాగోగులను పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లుకు తాళాలు వేయడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోన్న బారా షహీద్ దర్గా - నిర్వహణను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం