NDA Legislative Party Meeting : ఉచిత ఇసుక విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తెచ్చారు.
ఎమ్మెల్యేలకు సీఎం సవాల్ : ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని ప్రజాప్రతినిధులను సీఎం చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానం సరిగా లేదంటూ చీరాల ఎమ్మెల్యే కొండయ్య శాసనసభాపక్ష సమావేశంలో అంశం లేవనెత్తారు. ముందు అసలు ఇసుక విధానం చదివావా అంటూ సీఎం ప్రశ్నించారు. ఇసుక విధానం సమగ్రంగా చదివి ఎవరి పరిధిలో వారు అది సక్రమంగా అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇసుక విధానంలో సమస్య ఎక్కడుందో చెప్తే ఇప్పుడే పరిష్కారం చెప్తానంటూ ఎమ్మెల్యేలకు సీఎం సవాల్ విసిరారు. పర్యాటక రంగం అభివృద్ధిపై సమావేశంలో సుదీర్ఘ చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. టీటీడీ సిఫార్సు లేఖలపై రఘురామకృష్ణరాజు లేవనెత్తారు. 18న జరిగే బోర్డు సమావేశంలో సమస్య పరిష్కారమవుతుందని లోకేశ్ వివరించారు.
'లోకేశ్ బాగా పని చేశావు' - చంద్రబాబు అభినందనలు
ఎక్కువ పెట్టుబడులు వస్తాయి : సమావేశంలో వర్క్ ఫ్రమ్ హోం, పార్ట్ టైమ్ ఉద్యోగాల కల్పనపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. పర్యాటకరంగం ఆభివృద్ధి ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టాటా గ్రూప్ ఏర్పాటు చేసే హోటళ్ల ద్వారా 20వేల గదులు అందుబాటులోకి వస్తాయని సీఎం చెప్పారు. ఇలాంటి విజనరీ ఆలోచనలు అమలు చేయడం ఎంతో గర్వంగా ఉంటుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
జగన్ పాపాలు రైతుల పాలిట శాపాలు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన రీసర్వే వల్ల ఎదురైన సమస్యలను సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి లేవనెత్తారు. దాదాపు 6 వేల గ్రామాల్లో నిర్వహించిన రీ సర్వే ఫలితంగా లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారని చెప్పారు. రైతులెవ్వరికీ అడంగల్, 1బీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని భూమిరెడ్డి సమావేశం దృష్టికి తెచ్చారు. ఆయా గ్రామాల్లో రైతులు భూ అమ్మకాల కొనగోళ్లకు ఇబ్బంది తలెత్తడంతో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందట్లేదని వెల్లడించారు.
జగన్ పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారాయని మంత్రి అనగాని ధ్వజమెత్తారు. గ్రామ సభల ద్వారా సమస్య పరిష్కారం చేస్తున్నామని అనగాని తెలిపారు. గ్రామ సభలు పూర్తయ్యే లోపు పాత విధానాన్ని 6 వేల గ్రామాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారు. పాత విధానం ద్వారా భూ అమ్మకాలు, కొనుగోళ్లతో పాటు అన్ని ప్రభుత్వ పథకాలు రైతులకు అందేలా చూడాలని స్పష్టం చేశారు.