Narsampet Medical College Works : వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తితో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లను మంజూరు చేసింది. వైద్య కళాశాలకు పదెకరాల భూమిని ఆసుపత్రి దగ్గర రెవెన్యూ అధికారులు కేటాయించడంతో 220 పడకలతో మూడు బ్లాకులుగా ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టారు.
త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు : నిర్మాణం పూర్తి కావడంతో యుద్ధప్రాతిపదికన అంతర్గత పనులు చేపట్టారు. పాత ఆసుపత్రిలో 60 పడకలు ఉండగా కొత్త భవనాల్లో 140 పడకలను ఏర్పాటు చేశారు. త్వరలో ఆసుపత్రిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ సత్యశారద పర్యవేక్షణలో కళాశాల ప్రిన్సిపల్ మోహన్‌దాస్, ఆర్డీఓ కృష్ణవేణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాత పీహెచ్సీలో మహిళలు, పిల్లల వైద్యం కొనసాగనున్నాయని పీహెచ్‌సీలోని పరికరాలు, కొన్ని పడకలు, ఇతర సామాగ్రిని కొత్త ఆసుపత్రిలోకి తరలిస్తున్నారు. ల్యాబ్, వైద్య పరికరాలు, యంత్రాలు, పడకల ఏర్పాటు తదితర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
జాతీయ వైద్యకమిషన్ మార్గదర్శకాల మేరకు : జాతీయ వైద్య కమిషన్ ప్రభుత్వ వైద్య కళాశాలకు పూర్తిస్థాయి అనుమతులివ్వడంతో ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన సన్నాహాలు ముమ్మరం చేశారు. మొదటి విద్యాసంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాలను నడిపే విధంగా అధికారులు నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు.
ఎన్ఎంసీ అధికారులు వైద్య కళాశాలను జూన్ 26న తనిఖీచేసి ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ నెలాఖరు నాటికి ఆసుపత్రిని పూర్తి చేయాలని ఎన్ఎంసీ అధికారులు ఆదేశించడంతో ఇంజినీరింగ్ అధికారులు పనులను వేగవంతం చేశారు. వైద్య కళాశాలను నడిపేందుకు నిబంధనల ప్రకారం కావలసిన సిబ్బందిని నియమించుకున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, సూపరింటెండెంట్ డాక్టర్ భూక్యా కిషన్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలను నడిపేందుకు సిద్దంగా ఉన్నామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.
"నర్సంపేట మెడికల్ కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. ఏడు సీట్లు ఆలిండియా కోటాకు 43 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కనున్నాయి. ఇక్కడ విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అధ్యాపక సిబ్బంది కొరత ఉంది. త్వరలో వారిని కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం ఆదేశాల మేరకు కళాశాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం"- డా. మోహన్ దాస్, ప్రిన్సిపల్
Government Maternity Hospital: ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రినే ఎంచుకుంటున్నారు ఈ గ్రామ ప్రజలు...
సమస్యల పుట్టలా ఆ మాతాశిశు ఆరోగ్య కేంద్రం.. లక్ష్యానికి ఆమడదూరంలో..!