Nari Shakti Program at Vijayawada: మహిళా శక్తికి నిదర్శనం కాబట్టే దసరా పండుగ మహిళలకు ఎంతో ప్రత్యేకమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. విద్యుత్ కాంతులతో విజయవాడ పున్నమీ ఘాట్ శోభాయమానంగా మారింది. నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దసరా పండుగ విశిష్టత చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి.
ఈ క్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ పండుగ చేసుకోవడమంటే సంస్కృతి, సంప్రదాయాలను పాటించడమేనని గుర్తు చేశారు. సాంకేతిక యుగంలో ఆడబిడ్డల విజయాలు స్ఫూర్తి దాయకంగా ఉంటున్నాయని కొనియడారు. దేశానికి ఓ గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. కొన్ని అపోహలు, అలవాట్ల వల్ల మహిళా శక్తిని పూర్తిగా సమాజం ఉపయోగించుకోవడం లేదని వాపోయారు. మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
విజయవాడలో 'దసరా దాండియా' ఫెస్టివల్ - ఆకట్టుకున్న మహిళల నృత్యం
పడవలపై అమ్మవారి 9 రూపాలు: మహిళలని ఎలా గౌరవించుకోవాలో తెలిపే వేదికగా ఈ నారీ శక్తి విజయోత్సవం నిలవాలని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళల శక్తే ఈ నారీ శక్తి విజయం అని అభివర్ణించారు. రాజకీయ నాయకులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వెనుక వారి భార్యల కృషి ఎంతో ఉందని వెల్లడించారు. నారీ శక్తి విజయోత్సవంలో భాగంగా పున్నమి ఘాట్‌లో ఘనంగా నవదుర్గల హారతి కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా నదిలో ప్రత్యేకంగా అలంకరించిన పడవలపై అమ్మవారి 9 రూపాలు ప్రతిష్టించారు. వేదపండితులు అమ్మవారి ప్రతిమలకు హారతి ఇచ్చారు.
చంద్రబాబు వెనుక ఉండి నడిపే శక్తి భువనేశ్వరి: రాష్ట్రంలో మహిళా సాధికారతకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గుర్తు చేసారు. తన ఇంటి నుంచి ఆస్తిలో సమాన హక్కును మహిళలకు కల్పించారని అన్నారు. విజనరీ నాయకుడు చంద్రబాబు వెనుక ఉండి నడిపే శక్తి భువనేశ్వరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, మంత్రులు అనిత, సవిత, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పలువురు అఖిల భారత సర్వీసు అధికారుల సతీమణులు, వివిధ రంగాల మహిళా ప్రముఖులు,మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కనులపండువగా శ్రీవారి మహా రథోత్సవం - వైభవంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు
మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ - జలవిహారంపై ఇవాళ మధ్యాహ్నంలోగా నిర్ణయం