Narasaraopet ICICI Bank Customers Cash Missing in Accounts : పల్నాడు జిల్లా నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారుల ఖాతాల్లోని నగదు మాయమైంది. ఖాతాదారుల బంగారం, ఎఫ్‌డీ నగదు మాయమైనట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. పాత మేనేజర్, సిబ్బంది ఆధ్వర్యంలో మోసం జరిగినట్లు నిర్ధరణకు వచ్చారు. దీంతో బ్యాంకులోని రికార్డులను అధికారులు పరిశీలించారు. అలాగే ఖాతాదారులను బ్యాంకు వద్దకు పిలిచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా తమకు మూడు నెలలుగా వడ్డీ రావడం లేదని పలువురు ఖాతాదారులు అధికారుల వద్ద ఆరోపించారు. దీంతో మూడ్రోజుల్లో వడ్డీ చెల్లిస్తామని అధికారులు చెప్పినట్టు ఎఫ్‌డీ ఖాతాదారులు తెలిపారు.
బ్యాంకు వద్దకు వచ్చి బాధితులు గగ్గోలు : అయితే ఇటీవలే జిల్లాలోని చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఇలాంటి భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చిలకలూరిపేటలోని విజయ బ్యాంక్ సమీపంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో భారీ కుంభకోణం చోటు చేసుకుందని ఖాతాదారులు గురువారం ఆరోపించారు. గతంలో మేనేజర్‌గా పని చేసిన నరేశ్, గోల్డ్ అప్రైజర్ హరీశ్ ఆధ్వర్యంలో కోట్ల రూపాయల నగదు ఖాతాదారుల అకౌంట్ల నుంచి వివిధ రకాల మోసాలతో తస్కరించినట్టు బాధితులు పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు వచ్చి వాపోయారు. నగదు డిపాజిట్లు, తాకట్టు బంగారం విషయంలో ఎక్కువగా మోసం జరిగినట్లు బాధితులు బ్యాంకు వద్దకు వచ్చి గగ్గోలు పెట్టారు.
బ్యాంకులో గోల్‌మాల్ - స్పందించిన ఐసీఐసీఐ ప్రతినిధులు - ICICI Bank Response on Cheating
ఆందోళనతో బ్యాంకు వద్ద ఉద్రిక్తత : జరిగిన మోసం పట్టణమంతా వ్యాపించడంతో పెద్ద ఎత్తున బ్యాంకుకు ఖాతాదారులు వచ్చి తమ నగదు ఏమైందోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ఆగ్రహంతో బ్యాంకు ముందు ఉన్న కుండీలను పగలగొట్టారు. పరిశీలనకు వచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్, రీజినల్ మేనేజర్ రమేష్ ఖాతాదారుల నుంచి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. జరిగిన మోసంపై వివరణ కోరినప్పటికీ, తమ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే తాము నడుచుకోవాలని, అన్ని వివరాలు సేకరించి నివేదిక అందజేస్తామని అప్పటివరకు తాము ఏమీ చెప్పలేమని వారు తెలిపారు. ఖాతాదారుల ఆందోళనతో బ్యాంకు వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ నగదు, బంగారానికి సంబంధించి భరోసా ఇచ్చేవరకు బ్యాంకులో ఉన్న అధికారులను, సిబ్బందిని కదలనివ్వమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐసీఐసీఐ కస్టమర్లకు అలర్ట్ - ఆ వాట్సాప్ మెసేజెస్, కాల్స్ నమ్మితే ఇక అంతే! - ICICI Bank Fraud Alert