Narasapur Crochet Lace Craft Gets Geographical Indication Tag: భారతీయ వారసత్వం అనేక నైపుణ్యాలు మరియు హస్తకళల సమ్మేళనం. ఇది దేశం మొత్తం తరతరాలుగా కొనసాగుతోంది. ముఖ్యంగా మారుమూల గ్రామాలలో ఈ కళలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సరైన మార్కెటింగ్ లేక ఇవి చేతివృత్తులుగానే మిగిలిపోతున్నాయి. కానీ డిజిటల్ విప్లవ కాలంలో ఈ కళలన్నీ వెలుగుచూస్తున్నాయి. అలాంటి కళే క్రోచెట్ లేస్ తయారీ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాదలోని లేసు పార్కుకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్-జీఐ) లభించింది.
దుస్తుల డిజైన్లకు ఉపయోగించే లేసు అల్లికల్లో ఉభయగోదావరి జిల్లాలోని చాలామంది మహిళలది అందెవేసిన చేయి. వ్యవసాయ కుటుంబాలకు చెందిన మహిళలు తమ ఖాళీ సమయాల్లో లేస్ అల్లికల ద్వారా అద్భుతమైన కళాఖండాలు రూపొందించేవారు. ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంప్రదాయం అన్ని కుటుంబాలకు వ్యాపించింది. కళాత్మకంగా నేసే లేస్ లేస్ వర్క్ ఉత్పత్తులు అనేక ఫంక్షన్లకు బహుమతులుగా ఇస్తుంటారు. దీంతో వీటి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది.
కానీ ఉత్పత్తులను విక్రయించడానికి సరైన మార్గం లేకపోవడంతో మధ్యవర్తులు మహిళలను శ్రమను దోచుకునేవారు. తయారీదారులకు తక్కువ మొత్తంలో ఇచ్చి వారు మాత్రం భారీ లాభాలకు ఉత్పత్తులు విక్రయించేవారు. ఇలాంటి సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఈ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు నిర్ణయించింది. 2000లో అంబేడ్కర్ హస్త వికాస్ యోజన (AHVY) కింద ఈ అరుదైన హస్తకళను సంరక్షించేందుకు మరియు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవను డీఆర్డీఏ ఉపయోగించుకుని భారతదేశంలోనే మొట్టమొదటి లేస్ పార్క్‌ను నరసాపురంలో అభివృద్ధి చేసింది.
హైదరాబాద్ లాడ్‌బజార్ లక్క గాజులకు జీఐ గుర్తింపు - తెలంగాణ నుంచి 17వ ఉత్పత్తి
వేల కొలది లేస్ తయారీదారులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు, మధ్యవర్తుల దోపిడీకి గురి కాకుండా చూడటం ఈ సంస్థ లక్ష్యం. అలాగే మహిళలకు లేస్ తయారీలో శిక్షణ మరియు నైపుణ్యాన్ని నేర్పిస్తుంది. లాభాపేక్ష లేకుండా ఈ సంస్థ పని చేస్తుంది. అప్పటినుంచి ఇక్కడ మహిళలకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేసు అల్లికల్లో తర్ఫీదిస్తున్నారు.
నీలం, నారింజ, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు మరియు లేత గోధుమ రంగులతో కూడిన ఈ ఉత్పత్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కళాఖండాలు చాలా విభిన్నంగా ఉంటాయి. హ్యాండ్ పర్సుల నుండి ఫోన్ల కవర్ల వరకు ఈ ఉత్పత్తులు లభిస్తున్నాయి. ఇంకా వాల్ హ్యాంగింగ్స్, డోర్ కర్టెన్లు, సోఫా కవర్లు, కిడ్స్‌వేర్, మహిళల వస్త్రాలలో ఈ లేస్ పని తనం కనిపిస్తుంది. ఈ ఉత్పత్తులు దేశంలోనే కాకుండా యూకే, అమెరికా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
లేసు పార్కుకు జియోగ్రాఫికల్ గుర్తింపు రావడం శుభపరిణామం. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. ఇటీవల ముంబయికి చెందిన ఎగ్జిమ్ బ్యాంకు సహకారంతో 200 మంది శిక్షణ ఇచ్చాం. సరికొత్త ఆవిష్కరణలపై శిక్షణ, నూతన ఉత్పత్తులు, ఇండస్ట్రియల్ హియరింగ్ మిషన్ ఏర్పాటు, షోరూమ్ నిర్మాణం చేపట్టేందుకు కలెక్టర్ కృషి చేస్తున్నారు - ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, భీమవరం డీఆర్డీఏ పీడీ