Nara Chandrababu Cey Comments on Alliance : కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలంటే కేంద్ర సహకారం ఎంతో అవసరమని తేల్చిచెప్పారు. మహిళల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన 'కలలకు రెక్కలు' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, బీజేపీ, జనసేనతో పొత్తు అంశంపై స్పందించారు.
మేలు జరగాలంటే అధికార మార్పు అవసరం: ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజీ పడినట్లు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది సమాజ హితం కోసమే తప్ప స్వార్థం కోసం కాదని వివరించారు. పవన్ కల్యాణ్ సైతం వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనే లక్ష్యం కోసం నిలబడ్డారన్నారు. అంతా కలిసి నూతన ఒరవడి సృష్టించాలనే పొత్తు పెట్టుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రజలకు మేలు జరగాలంటే, అధికార మార్పు అవసరమని, అందుకే పొత్తు రాజ్యాధికారం కోసం తప్ప తమ కోసం కాదని స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలంటే వైఎస్సార్సీపీ పోవాల్సిందే అన్నారు. చేయరాని తప్పులు చేసిన జగన్ తాను ఏకాకినంటున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర హితం కోసమే పొత్తు పెట్టుకుని ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరించామన్నారు. మూడు పార్టీల్లో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదని తేల్చిచెప్పారు. సీట్లు రాని ఆశావహులు నిరాశ చెందకుండా పొత్తు ధర్మాన్ని పాటించి సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కష్టపడిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థినుల కోసం 'కలలకు రెక్కలు' పథకం - ప్రకటించిన నారా భువనేశ్వరి
kalalakurekkalu.com: ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు, పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చేలా కలలకు రెక్కలు రూపకల్పన చేసినట్లు చంద్రబాబు తెలిపారు. మహిళల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన 'కలలకు రెక్కలు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. ఇప్పటికే పేరు నమోదు చేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ kalalakurekkalu.com వెబ్ సైట్ రూపొందించింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని మహిళలు ఇంటికే పరిమితం కాకుండా 'కలలకు రెక్కలు' అనే పథకానికి శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు వివరించారు. కోర్సు కాలానికి రుణం పై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా పథకం ప్రణాళిక రూపొందించామన్నారు. యువత ముప్పేళ్ల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటు ఎంతో అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు.
'కలలకు రెక్కలు' పథకానికి అనూహ్య స్పందన- 11,738 మంది యువత దరఖాస్తు
వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది: పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం రూపొందించిన పథకాలు వల్ల ఎందరో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారని చంద్రబాబు తెలిపారు. విద్యార్ధినుల ఉన్నత చదువుల కోసం బ్యాంక్ లోన్లు తీసుకునేలా తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. గతంలో తాము యువత విదేశాల్లో స్థిరపడేలా ఐటీని ప్రొత్సహించామని, ఐటీ వల్ల ఓటర్లందరూ విదేశాలకు వెళ్లిపోతున్నాయని తనను విమర్శించారని గుర్తుచేశారు. విద్యార్థినులకు అందే ఇతర పథకాలతో పాటు కలలకు రెక్కలు పథకాన్ని అందిస్తామని, దీనిపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఐటీకే కాదు, వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో నైపుణ్య శిక్షణకి ఈ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. విద్యార్థినుల కలలకు తాము రెక్కలు తొడిగి, స్వావలంబనకు సహకరిస్తామని పేర్కొన్నారు. మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు ఇప్పటికే మహాశక్తి పథకాన్ని తెలుగుదేశం సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో చేర్చిన విషయం తెలిసిందే.
LIVE: ‘కలలకు రెక్కలు’ పథకంలో విద్యార్థినుల రిజిస్ట్రేషన్ - పాల్గొన్న చంద్రబాబు