Nara Bhuvaneshwari on Handloom Clothes : రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలనే కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలబడదామని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. పర్వదినాలకు వాటిని ధరించుదామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ ప్రాంతాలు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందినట్లు పేర్కొన్నారు.
నిజం గెలవాలి యాత్ర సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల్ని కలిశానని భువనేశ్వేరి వివరించారు. వారి కష్టాలు తెలుసుకున్నట్లు చెప్పారు. వారికి సంఘీభావంగా రాబోయే పండుగలకు నేత వస్త్రాల్ని కొనుగోలు చేద్దామని పేర్కొన్నారు. తద్వారా నూలు పోగుతో అద్భుతాలు సృష్టించే చేనేతలు కూడా మరింత ఆనందంగా పండుగ చేసుకొనేలా చేద్దామని తెలిపారు. మన చేనేత, మన సంస్కృతి, మన సంప్రదాయమని వెల్లడించారు. ఈ విషయంపై మహిళా మంత్రులు స్పందించారు.
రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొందాం. పండగల్లో వాటిని ధరించుదాం. నూలుపోగుతో అద్భుతాలు సృష్టించే చేనేతలు కూడా.. మరింత ఆనందంగా పండుగ చేసుకొనేలా చేద్దాం.#Chenetha #Nethanna#Telangana #AndhraPradesh pic.twitter.com/fW6XP8CmQM
— Nara Bhuvaneswari (@ManagingTrustee) September 28, 2024
భువనేశ్వరికి ధన్యవాదాలు తెలిపిన సవిత : రాబోయే పండుగల నేపథ్యంలో చేనేత వస్త్రాలు ధరించాలని, నేతన్న కళాకారులకు అండగా నిలవాలని కోరిన నారా భువనేశ్వరికి చేనేత శాఖ మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. వారిని ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు ఇప్పటికే కార్యాచరణ చేపట్టారని వెల్లడించారు. నేతన్నల అభివృద్ధికి 2014-2019లో అమలు చేసిన పథకాలన్నింటినీ మరోసారి అమలు చేయనున్నట్లు సవిత పేర్కొన్నారు.
చేనేత వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నామని సవిత వివరించారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిబిషన్లు నిర్వహించడం, ఈ కామర్స్‌లో చేనేత వస్త్రాల విక్రయాలకు అవకాశం కల్పించడంపై తమ సర్కార్ చర్యలు చేపట్టిందని మంత్రి సవిత వెల్లడించారు.
Minister Anitha on Handloom Clothes : పండుగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరించాలని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపు మేరకు తెలుగు ప్రజలు చేనేతకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఒంట్లో నరాలను దారాలుగా పోగు చేసి, కష్టపడి రక్తంతో రంగులు అద్దుతూ చెమటోడ్చే చేనేతల బతుకు చిత్రం మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అనిత కోరారు.
రాబోయే రోజుల్లో వరుస పండుగల నేపథ్యంలో మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే వస్త్రాలను ధరించడంతో పాటు చేనేతల కళారూపాలకు పెద్దపీట వేయాలని అనిత కోరారు. కుటుంబంతో పాటు మన ఇంట్లో సంతోషంగా పండుగ చేసుకోవడంతో పాటు చేనేత వస్త్రాలపై ఆధారపడి బతికే అందరి ఇళ్లల్లో పండుగ ఆనందం నింపాలని హోంమంత్రి అనిత ఆకాంక్షించారు.
విజయవాడలో ఆకట్టుకున్న ముద్దుగుమ్మల చేనేత హొయలు - closing handloom textile ceremony